
ఆగని ఏనుగుల దాడులు
పులిచెర్ల(కల్లూరు): మండలంలో గత మూడు రోజులుగా ఏనుగుల దాడులు ఆగనంటున్నాయి. రైతుల కష్టం నేలపాలవుతూనే ఉంది. శనివారం మండలంలోని గండోలపల్లెచపెనుబాల దళితవాడ, మిట్టమీద రాచపల్లె, దిగువమూర్తివారిపల్లెల్లోని అరటి, టమాట, పశుగ్రాసం, తోట చుట్టూ ఉన్న కంచె, కూసాలను ధ్వంసం చేశాయి. 16 ఏనుగుల గుంపు పాళెం పంచాయతీ సమీపంలోని చింతలవంక ప్రాంతంలో తిష్టవేసి దాడి చేస్తున్నట్టు రైతులు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ఏనుగుల దాడుల నుంచి పంటలను రక్షించాలని కోరుతున్నారు.
శ్రీవారి సర్వదర్శనానికి
18 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 26 కంపార్ట్‌మెంట్లు నిండాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 70,480 మంది స్వామివారిని దర్శించుకోగా 28,923 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.17 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. కాగా సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలో అనుమతించబోరని స్పష్టం చేసింది.