
పుత్తూరులో వర్ష బీభత్సం
పుత్తూరు: మండల పరిధిలో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. పుత్తూరులో 74.6 మి.మీ వర్షపాతం నమోదైంది. మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డుకు చెందిన రామారావు కాలనీలో గాలీవానకు 80 ఏళ్ల నాటి వేపమాను నేలకొరిగింది. కాలనీకి చెందిన మూడు కుటుంబాల వారు తమ కార్లను ప్రతిరోజూ చెట్టు సమీపంలోనే పార్కు చేసేవారు. గాలీవానకు మహావృక్షం కూలడంతో మూడు కార్లు ధ్వంసమయ్యాయి. చెట్టు రోడ్డుకడ్డంగా పడిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ వైర్లు సైతం తెగి రోడ్డుపై పడ్డాయి. ఎలాంటి ప్రాణనష్టమూ సంభవించలేదు. స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు చక్రపాణి, దిలీప్‌మొదలి రాకపోకలు పునరుద్ధరించడానికి చర్యలు చేపట్టారు. పుత్తూరులో ఆగస్టులో సాధారణ వర్షపాతం 146.1 మి.మీ కాగా గురువారం రాత్రి ఒక్కరోజే 74.6 మి.మీ వర్షపాతం నమోదైంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎంబీ రోడ్డులోని అండర్ బ్రిడ్జిలో నీరు నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.