
ఇదేంది వినాయకా?
కాణిపాక వినాయక దేవస్థానంలో టెండర్‌దారులు డిపాజిట్ల చెల్లింపులో జాప్యం చేస్తున్నారు. ఈ జాప్యంతో డిపాజిట్ చెల్లింపు సొమ్ము రూ.కోటి దాటింది. పలు టెండర్‌దారులు చెల్లింపునకు అధికారాన్ని అడ్డుపెడుతున్నారు. అదనపు వసూళ్లను మాత్రం యథేచ్ఛగా సాగిస్తున్నారు. అధికారులను తమ గుప్పెట్లో పెట్టుకుని ఈ వ్యవహారాన్ని నడిపిస్తుండడం విమర్శలకు తావిస్తోంది.
సాక్షి టాస్క్‌ఫోర్స్: కాణిపాక శ్రీవరసిద్ధి వినాయకస్వామి క్షేత్రానికి వేలాది మంది భక్తులు వస్తుంటారు. సాధారణ రోజుల్లో భక్తుల సంఖ్య 10 వేలు దాటుతోంది. శని, ఆదివారాల్లో 30 వేల మంది దాకా వస్తుంటారు. భక్తుల సౌకర్యార్థం ఇక్కడ పలు షాపులు, నిర్వహణలు జరుగుతుంటాయి. ఇందులో కొబ్బరికాయలు కొట్టే ప్రాంతం, మొబైల్ కౌంటర్, చెప్పుల కౌంటర్, పూజాసామగ్రి అమ్మకాలు, పాలు, వాహన పూజ, పార్కింగ్, టోల్‌గేట్, షాపులు తదితరాలు జరుగుతుంటాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వీటిలో చాలా వరకు చేతులు మారాయి. కూటమినేతలు అధికారిన్ని అడ్డంపెట్టుకుని అడ్డుగోలుగా దక్కించుకున్నారు. ఇందులో కొన్ని టెండర్లు, వేలం పాటకు రాకుండా అలాగే కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
టెండర్ల సొమ్ము చెల్లించరా?
గత ఆరు నెలల కిందట పలు షాపుల నిర్వహణకు సంబంధించి ఆలయ అధికారులు నామమాత్రంగా టెండర్లు పిలిచారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొందరు టెండర్లను దక్కించుకున్నారు. వీరు టెండర్లు జరిగి నెలలు గడుస్తున్నా ఇంతవరకు టెండర్ సొమ్ము జమ చేయలేదన్న ఆరోపణలున్నాయి. అప్పట్లోనే రూ.కోటికిపైగా ఉన్న టెండర్ బకాయిలు.. ఆ త ర్వాత రూ.90 లక్షలకు నిలిచింది. కొత్తగా జరిగిన టెండర్లతో ఆలయానికి చెల్లించాల్సిన టెండర్ నగదు మళ్లీ రూ.కోటి దాటినట్టు తెలుస్తోంది. ఈ చెల్లింపుపై అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. టెండర్లు దక్కించుకున్న వెంటనే నగదు చెల్లింపులు చేసుకోవాల్సిన బాధ్యతను విస్మరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కూటమిలోని మరో వర్గం కూడా దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఓ ప్రజాప్రతినిధి కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోందని వారు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ ప్రజాప్రతినిధి బినామీ పేర్లతో వీటిని నిర్వహిస్తున్నారని, అందుకే డిపాజిట్ చెల్లింపుపై అధికారులు సైతం నోరు విప్పడం లేదని వారు చెబుతున్నారు.
కాణిపాక దేవస్థానంలో
పేరుకుపోయిన డిపాజిట్ బకాయిలు
అధికారాన్ని అడ్డం పెట్టుకుని చెల్లించని టెండర్‌దారులు
అడ్డగోలుగా అదనపు వసూళ్లు
పట్టించుకోని అధికారులు
యథేచ్ఛగా అదనపు వసూళ్లు
ఆలయ అధికారుల ఆదేశాలు, నిర్ణయాల మేరకు అమ్మకాలు జరగాలి. వారు నిర్ణయించిన ధర ప్రకారమే నిర్వహణ దారులు వసూలు చేయాలి. అయితే పలువురు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. అదనపు వసూళ్లకు తెరలేపుతున్నారు. రూ.5 నుంచి రూ.20 వరకు అదనంగా భక్తుల నుంచి గుంజేస్తున్నారు. దీనిపై ఫిర్యాదులు వచ్చినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఆలయం ఎదుటే ఇవన్నీ జరుగుతున్నా చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి టెండర్ల చెల్లింపు, అదనపు వసూళ్ల కట్టడికి చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే బ్రహ్మోత్సవ సమయంలో ఈ దోపిడీ మరింత అధికమయ్యే అవకాశాలున్నాయని వారు వివరిస్తున్నారు.