
15న జనరల్ నాలెడ్జ్ టెస్ట్
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ప్రజాహిత సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన చిత్తూరు నగరంలోని రెవెన్యూ భవనంలో జనరల్ నాలెడ్జ్ టెస్ట్‌ను నిర్వహించనున్నట్టు సంస్థ అధ్యక్షుడు రాజారత్నంరెడ్డి తెలిపారు. సాయంత్రం 4 గంటలకు టెస్ట్ ప్రారంభమవుతుందన్నారు. 8, 9, 10 తరగతులు పూర్తి చేసిన విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులన్నారు. ఆసక్తిగల వారు ముందస్తుగా పేర్లు నమోదు చేసుకోవాలని, 9908274927 నంబరులో సంప్రదించాలని ఆయన సూచించారు.
బోయకొండ పాలకమండలికి దరఖాస్తులు
చౌడేపల్లె: బోయకొండ పాలక మండలి ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆలయ ఈఓ ఏకాంబరం శుక్రవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ దేవదాయ ధర్మాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వి.వినయ్‌చంద్ ఈ నెల 7వ తేదీన విడుదల చేసిన ఆదేశాల మేరకు 27 వ తేదీలోపు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. అభ్యర్థులు దరఖాస్తులను బోయకొండ గంగమ్మ దేవస్థానం పరిపాలనా భవనంలో అందజేయాలని కోరారు.
12న మెగా టింకరింగ్ డే
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని అన్ని యాజమాన్యాల ప్రభుత్వ పాఠశాలల్లో ఈనెల 12వ తేదీన మెగా టింకరింగ్ డే నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. పాఠశాలల్లో ఉదయం 10 నుంచి 11 గంటల వరకు తప్పనిసరిగా మెగా టింకరింగ్ డే కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. డీవైఈవో, ఎంఈవోలు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని పేర్కొన్నారు.
28న జాతీయ క్రీడా వేడుకలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో ఈనెల 28వ తేదీన జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని జిల్లా స్థాయి స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డుల ఎంపిక నిర్వహించాలన్నారు. దీనికి సంబంధించి దరఖాస్తులను స్వీకరించేందుకు ఈనెల 18 ఆఖరి తేదీ అని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ఐదు ఉత్తమ పాఠశాలలను ఎంపిక చేయాలని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు.
పశుగ్రాస విత్తనాల పంపిణీ
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో పశుగ్రాస విత్తనాలు పంపిణీ చేస్తున్నామని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి అరిఫ్ తెలిపారు. జిల్లాకు 375 మెట్రిక్ టన్నుల జొన్న, మొక్కజొన్న విత్తనాలు వచ్చాయన్నారు. ఇప్పటికే మండలాల వారీగా సరఫరా ప్రారంభమైందన్నారు. జొన్న కేజీ రూ.23, మొక్కజొన్న కేజీ రూ.17 చొప్పున అందజేస్తామని ఆయన పేర్కొన్నారు.
23 నుంచి ఈఎండీ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈనెల 23వ తేదీ నుంచి ఎంటర్‌ప్రెన్యూర్ మైండ్‌సెట్ డెవలప్‌మెంట్ (ఈఎండీ) కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈమేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు కసరత్తు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి శనివారం ప్రత్యేక తరగతులను నిర్వహించనున్నారు. పర్యవేక్షణకు జిల్లా స్థాయి మేనేజర్‌ను నియమించనున్నారు. జిల్లాకు ఇద్దరు మెంటర్ టీచర్లను ఎంపిక చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. రిజిస్ట్రేషన్‌లకు లీప్ యాప్‌లో అవకాశం కల్పించారు.
ఇస్రో క్విజ్ పోటీల్లో ప్రతిభ
చిత్తూరు కలెక్టరేట్ : ఇస్రో క్విజ్ పోటీల్లో పీవీకేఎన్ విద్యార్థులు ప్రతిభ చాటినట్టు ఆ కళాశాల ప్రిన్సిపల్ డా.జీవనజ్యోతి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆ కళాశాలలో విద్యార్థులను అభినందించారు. ఆమె మాట్లాడుతూ జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ఇస్రో క్విజ్ పోటీలు నిర్వహించారన్నారు. ఈ పోటీల్లో తమ కళాశాల నుంచి విద్యార్థులు ప్రథమ బహుమతి సాధించినట్టు పేర్కొన్నారు. అదేవిధంగా ప్రెజెంటేషన్ విభాగంలో తృతీయ బహుమతి పొందినట్టు వెల్లడించారు. ప్రతిభ చాటిన విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన అధ్యాపకులు భానుప్రసాద్, రమేష్, భ్రమరాంబిక, రామమూర్తి, రామసాగర్, ఉదయభాస్కర్లను ప్రత్యేకంగా అభినందించారు.శాస్త్ర, సాంకేతిక రంగాల్లోని మెలకువలను నేర్చుకుని విద్యార్థులు గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆమె ఆకాంక్షించారు. వైస్ ప్రిన్సిపల్ నాగేంద్ర, అధ్యాపకులు శరవణ పాల్గొన్నారు.