
బోయకొండ.. జన దండు
చౌడేపల్లె : ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న బోయకొండ గంగమ్మ ఆలయం భక్తులతో గురువారం పోటెత్తింది. కోరిన కోర్కెలు తీర్చే గంగమ్మ ఆశీర్వదించమ్మా అంటూ పూజలు చేశారు. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేల మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం వివిధ వాహనాల్లో తరలి వచ్చారు. అర్చకులు అమ్మవారిని ప్రత్యేక అలంకరణలో అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. శ్రావణ మాసంతో పాటు వరలక్ష్మివ్రత పూజలను పుర స్కరించుకొని అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాలు సకాలంలో కురిసి పంటలు బాగా పండాలని, జంతు సంపద వృద్ధి చెందాలంటూ పలు గ్రామాల రైతులు అమ్మవారికి పూజలు చేశారు. అఽధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆలయ ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది ఉచిత ప్రసాదాలను పంపిణీ చేశారు. పోలీసులు ఎలాంటి సంఘటనలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు.