
బాలల కమిటీలు పటిష్టంగా పనిచేయాలి
● బాల్యవివాహాలను నిర్మూలించాలి ● స్వాతంత్య్ర వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు ● వరుస సమీక్షల్లో కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో బాలల సంక్షేమ, పరిరక్షణ కమిటీలు పటిష్టంగా పనిచేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. జిల్లాలోని పలు శాఖల అధికారులతో గురువారం వరుస సమీక్షలు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. బాల్య వివాహాల వల్ల కలిగే దుష్ఫలితాలు ప్రమాదకరమైనవన్నారు.
జిల్లాలో బాల్య వివాహాలు, కౌమారదర్శ గర్భదారణలు, బాల్య లైంగిక వేధింపులు, బాలల అక్రమ రవాణా, మత్తు పదార్థాల దుర్వినియోగం వంటివి గుర్తించేందుకు ప్రత్యేక సర్వేలు నిర్వహించాలన్నారు. అత్యంత ప్రమాదకర ప్రాంతాలను మ్యాప్ చేసి ఆ ప్రాంతాలలో తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. బాలల సంరక్షణ కేంద్రాలు, పాఠశాలల సందర్శన, వెల్ఫేర్, విద్యాశాఖల ఆధ్వర్యంలో నిర్వహించే వసతి పాఠశాలలను క్రమం తప్పకుండా సందర్శించాలన్నారు. బాలల చట్టాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ రాజశేఖర్‌రాజు, ఐసీడీఎస్ పీడీ వెంకటేశ్వరి, బాలల సంరక్షణ అధికారి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
స్వాతంత్య్ర వేడుకలకు
పకడ్బందీ ఏర్పాట్లు.....
ఈనెల 15న జిల్లా కేంద్రంలోని పరేడ్ మైదానంలో నిర్వహించే స్వాతంత్య్ర వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవంను ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలన్నారు. పోలీసు గౌరవ వందనం, కవాతు, బందోబస్తు, ట్రాఫిక్ సమస్యల అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రశంస పత్రాల విషయంలో గందరగోళంను నివారించేందుకు ముందుగానే సంబంధిత సిబ్బంది సిద్ధంగా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా వైద్యశాఖామంత్రి సత్యకుమార్ యాదవ్ వస్తున్నట్లు తెలిపారు. ఆయా శాఖల అధికారులకు అప్పగించిన బాధ్యతలను తప్పకుండా చేపట్టాలన్నారు. సమీక్షలో డీఆర్‌వో మోహన్ కుమార్, డీఎఫ్‌వో భరణి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
పక్కాగా జీఎస్‌టీ వసూలు చేయండి
జిల్లాలో జీఎస్‌టీ పక్కాగా వసూలు చేయాలని కలెక్టర్ వాణిజ్య పన్నుల శాఖ అధికారులను ఆదేశించారు. పన్నుదారుల నుంచి జీఎస్‌టీ వసూలు చేసేందుకు సంబంధిత శాఖల అధికారులు కృషి చేయాలన్నారు. వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తూ పన్ను పరిధిలోకి రాని సంస్థలపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. డీపాల్టర్స్ బ్యాంక్ అటాచ్‌మెంట్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బిల్లుల చెల్లింపుల ముందు ట్యాక్స్ డిడెక్షన్ తప్పనిసరిగా అమలు చేసి రెవెన్యూ లోటును నివారించాలన్నారు. అన్ని ప్రొఫెషనల్ సర్వీసు సంస్థలు, విద్యాసంస్థలు, ఇంజినీరింగ్, మెడికల్ ప్రొఫెషనల్స్ తప్పనిసరిగా జీఎస్‌టీ పరిధిలోకి రావాల్సిందేనని స్పష్టం చేశారు. మున్సిపల్ కమిషనర్‌లు వార్డుల్లో పర్యటించి పన్నులు విధించే ప్రక్రియను బలోపేతం చేయాలన్నారు. స్థిరాస్థుల గుర్తింపు, బకాయిల వసూళ్ల సందర్భంలో ఆస్తులను జప్తు చేయడంలో రెవెన్యూ శాఖ అధికారులు పన్నులు ఎగవేస్తున్న నకిలీలను గుర్తించాలన్నారు. సమీక్షలో చిత్తూరు డివిజన్ వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ రవీంద్రనాథ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.