
వివాహిత బలవన్మరణం
నిండ్ర : మండలంలోని పాదిరి దళితవాడకు చెందిన వివాహిత కౌసల్య బలవన్మరణానికి పాల్పడింది. పోలీసుల కథనం మేరకు వివరాలు.. నిండ్ర మండలం పాదరి దళితవాడకు చెందిన దొరైరాజ్, మలర్ దంపతుల పెద్దకుమారుడు చార్లెస్‌తో నగరి దళితవాడకు చెందిన రీటా కుమార్తెతో 2021లో ప్రేమ వివాహం జరిపించారు. కొంత కాలం వీరి కాపురం సజావుగా సాగింది. తరువాత కౌసల్య భర్త చార్లెస్ మరో మహిళతో వివాహేతర సంబంధం అనుమానంతో కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో బుధవారం గొడవలు జరగడంతో మనస్తాపానికి గురై కౌసల్య ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని కౌసల్య తల్లి రీటా నిండ్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్తె మృతికి చార్లెస్, దొరైరాజ్, మలర్ కారణమని వారిపై చర్యలు తీసుకోవాలని, అదే విధంగా ఇద్దరి పిల్లలను తమకు అప్పగించాలని బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసినట్లు ఇన్‌చార్జి ఎస్‌ఐ మహేష్ తెలిపారు.