
మామిడి రైతుల సంతకాల సేకరణ ఉద్యమం
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తోతాపురికి కేజీ రూ.12..వెంటనే రైతు బ్యాంకు ఖాతాకు జమ చేయాలని సంతకాల సేకరణ ఉద్యమం చేపడుతున్నట్లు రైతు నాయకులు సుకుమార్, సుధా ఒక ప్రకటనలో తెలిపారు. ప్రకటించిన రూ.12 చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో 13వ తేదీన చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద నల్లబ్యాడ్జీలతో ధర్నా నిర్వహిస్తామని, దీంతో పాటు సంతకాల సేకరణ ఉద్యమం చేస్తామని పేర్కొన్నారు.
బాలికతో పెళ్లి ఘటనపై నిందితుడికి 20 ఏళ్ల జైలు
చిత్తూరు అర్బన్ : బాలికను పెళ్లి చేసుకుని, ఆపై కాపురం పెట్టినందుకు గాను లోకేష్ అనే నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఈ మేరకు చిత్తూరులోని పోక్సో న్యాయస్థానం న్యాయమూర్తి ఎం.శంకరరావు గురువారం తీర్పునిచ్చారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ మోహనకుమారి కథనం మేరకు వివరాలిలా.. ఓ పట్టణానికి చెందిన 14 ఏళ్ల బాలిక కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులు 2022 ఫిబ్రవరిలో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొలుత మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వెదురుకుప్పం చెందిన లోకేష్ అనే నిందితుడు బాలికను పెళ్లి చేసుకొని పలుమార్లు శారీరకంగా కలిసినట్లు గుర్తించారు. బాలికను లోకేష్ నుంచి విడిపించిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.9500 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
కాలువలో పడిన లారీ.. తప్పిన ప్రమాదం
చిత్తూరు అర్బన్ : రెండు రోజులుగా నగరంలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. వైజాగ్ నుంచి సబ్బులు, షాంపులు ఇతర వస్తువుల లోడ్‌ను వి.కోటకు చెందిన డ్రైవర్ నారాయణస్వామి బుధవారం చిత్తూరుకు తీసుకొచ్చాడు. లారీని కట్టమంచి చెరువు ఎదురుగా రోడ్డుపై పార్కింగ్ చేశాడు. గురువారం ఉదయం లారీని స్టార్ట్ చేసి, ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలో లారీ బోల్తా పడిపోయింది. ప్రమాదంలో చిన్నపాటి గాయం కూడా తగలకుండా అదృష్టవశాత్తు నారాయణస్వామి బయటపడ్డాడు. లారీ పాక్షికంగా ధ్వంసమయ్యింది. అనంతరం క్రేన్ల సాయంతో లారీని కాలువ నుంచి బయటకు తీశారు. ట్రాఫిక్ పోలీసులు ఘటనపై విచారణ చేస్తున్నారు.