
ఇక తప్పులు లేని ఓటరు జాబితా
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఓటరు జాబితా పూర్తిస్థాయి ప్రక్షాళన దిశగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఈ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా బూత్ స్థాయి సిబ్బందికి ఇటీవల శిక్షణ ఇచ్చారు. బీహారులో ఓటరు జాబితాల్లో లోపాలు గుర్తించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రక్షాళన చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.
ఏటా ఓటరు జాబితా సంక్షిప్త సవరణ
ఏటా ఓటరు జాబితాను సంక్షిప్త సవరణ చేస్తున్నారు. లోపాలు సరిచేయకపోవడంతో పాటు ఎన్నికల సమయంలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటి నుంచే జాబితాను పూర్తి స్థాయి పరిశీలించి లోపాలు గుర్తించి సమగ్రమైన ఓటరు జాబితా సిద్ధం చేయాలనేది ఎన్నికల సంఘం ఉద్దేశం. జిల్లా వ్యాప్తంగా బీఎల్‌వోలకు గత నెలలో ఆయా నియోజకవర్గాల ఆర్‌వోల పరిధిలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. సమగ్రమైన ఓటరు జాబితా తయారీకి బీఎల్‌వో లతో పాటు రాజకీయ పార్టీల ఏజెంట్లతో సమన్వయం చేసుకునేలా చర్యలు తీసుకున్నారు. సెప్టెంబరులో ఈ ప్రక్రియ ప్రారంభిస్తారని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఇందుకు గాను తక్షణమే బీఎల్‌వోలు, సూపర్‌వైజర్ల ఖాళీలు భర్తీ చేయాలని ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.
పకడ్బందీగా క్షేత్రస్థాయి పరిశీలన
జిల్లాలో ప్రస్తుతం 15,72,542 మంది ఓటర్లు ఉండగా 1776 పోలింగ్ కేంద్రాలున్నాయి. ప్రస్తుతానికి రాజకీయ పార్టీల ఏజెంట్లు 4,857 మంది ఉన్నారు. వీరంతా కలిసి ఓటర్లు స్థానికంగా ఉంటున్నారా లేదా, వలస వెళ్లారా శాశ్వతంగా వలస వెళ్లారా, తాత్కాలికమా తదితర అంశాలను పరిశీలించనున్నారు.
బీఎల్‌వోలకు ప్రత్యేక శిక్షణ
జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బీఎల్‌వోలకు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక శిక్షణలు పూర్తి చేయడం జరిగింది. తప్పులు లేని ఓటర్ల జాబితాను సిద్ధం చేసేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టడం జరుగుతోంది. ఎన్నికల సంఘం ఇచ్చే ఆదేశాలను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి వెల్లడిస్తున్నాం. – మోహన్ కుమార్, డీఆర్‌వో, చిత్తూరు

ఇక తప్పులు లేని ఓటరు జాబితా