
కూటమి పాలనలో మద్యం షాపులకే ప్రాధాన్యం
వెదురుకుప్పం : కూటమి పాలనలో సర్కారు బడుల కంటే మద్యం దుకాణాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బడులను మూసి వేసే పరిస్థితి నెలకొందన్నారు. కూటమి ప్రభుత్వంలో నాణ్యమైన విద్య పేదలకు అందుబాటులో లేకపోగా ఎక్కడ చూసినా బెల్టు షాపుల ద్వారా మద్యం ఏరులై పారుతున్నట్లు ఆరోపించారు. గ్రామాల్లో సర్కారు బడులకన్నా సర్కారు మద్యం షాపులు, బెల్టు షాపులు ఎక్కువగా కనిపిస్తున్నట్లు పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో నాడు–నేడు ద్వారా సర్కారు బడుల రూపురేఖలు మార్చితే కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసినట్లు గుర్తు చేశారు. గతంలో పేదలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను ప్రస్తుత ప్రభుత్వం వివిధ కారణాల రీత్యా స్థాయి తగ్గించడంతో పాటు రద్దు చేసేందుకు పూనుకోవడం బాధాకరమన్నారు. ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో వెదురు కుప్పంలో డిగ్రీ కళాశాలను తీసుకొచ్చినట్లు చెప్పారు. అప్పట్లోనే ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి నిధులు కూడా మంజూరు చేసినట్లు గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం డిగ్రీ కళాశాల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రజల్లో అనుమానాలు వస్తున్నట్లు చెప్పారు. డిగ్రీ కళాశాల ఉంటుందా లేదా అనే ప్రశ్నలు ఎదురవుతున్నట్లు చెప్పారు.