రేపు కాణిపాకానికి ఏపీ హైకోర్టు జడ్జి | - | Sakshi
Sakshi News home page

రేపు కాణిపాకానికి ఏపీ హైకోర్టు జడ్జి

Aug 7 2025 7:48 AM | Updated on Aug 7 2025 8:02 AM

రేపు కాణిపాకానికి  ఏపీ హైకోర్టు జడ్జి

రేపు కాణిపాకానికి ఏపీ హైకోర్టు జడ్జి

చిత్తూరు కలెక్టరేట్‌ : ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు జడ్జి గోపాల్‌ కృష్ణారావు ఈనెల 8వ తేదీన కాణిపాకానికి రానున్నారని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన 8వ తేదీ ఉదయం 10 గంటలకు కాణిపాకంకు వస్తారన్నారు. కుటుంబ సమేతంగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకుంటారన్నారు. అనంతరం ఆలయ అతిథి గృహంలో విశ్రాంతి తీసుకుని ఉదయం 11.30 గంటలకు తిరుపతి జిల్లా తిరుచానూరుకు బయలుదేరి వెళ్తారని కలెక్టర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఎమ్మెల్సీపై దాడి దారుణం

కుప్పం : కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌పై దాడి చేయడం దారుణమ ని కుప్పం సమన్వయకర్త, ఎమ్మెల్సీ భరత్‌ ఖండించారు. బుధవారం పులివెందుల ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండవారిపల్లిలో ప్రచారం నిర్వహిస్తుండగా టీడీపీ నేతలు ఆయన కాన్వాయ్‌పై దాడి చేసి కారును ధ్వంసం చేయడం దుర్మార్గం అన్నారు. ప్రజాప్రతినిధులకు రక్షణ లేకుండా కూటమి ప్రభుత్వం నడుచుకోవడం బాధాకరమన్నారు. ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌పై దాడిని ఆయన తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

విద్యుత్‌ గ్రీవెన్స్‌కు 6 ఫిర్యాదులు

చిత్తూరు కార్పొరేషన్‌ : నగరంలోని ట్రాన్స్‌కో కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విద్యుత్‌ గ్రీవెన్స్‌ కార్యక్రమానికి మొత్తం 6 ఫిర్యాదులు వచ్చాయి. కొంగారెడ్డిపల్లె, మురకంబట్టు పరంగా రివిజన్‌ ఆఫ్‌ బిల్లు, సంతపేట పరంగా కేటగిరి మార్పు, గుడిపాల, కొత్తపల్లెలో ఫోన్‌ నంబర్‌ మార్పు, సర్వీసు పేరు మార్పు పరంగా ఫిర్యాదులు వచ్చాయని ఏఈ మాధురి పేర్కొన్నారు. ఇందులో 4 సమస్యలు పరిష్కరించామని మరో రెండు పరిశీలన దశలో ఉన్నాయని వివరించారు. కార్యక్రమంలో చిత్తూరు రూరల్‌ సెక్షన్‌ ఏఈ రాజా పాల్గొన్నారు.

‘రండి.. టీ తాగుతూ మాట్లాడుకుందాం’

– ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శివయ్య

ఐరాల : ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కే.ఆర్‌.సూర్యనారాయణ విన్నూతంగా ‘రండి.. టీ తాగుతూ మాట్లాడుకుందాం’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షడు శివయ్య తెలిపారు. బుధవారం కాణిపాకం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రండి.. టీ తాగుతూ మాట్లాడుకుందాం కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నేరవేర్చకపోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఉద్యోగులకు సుమారు రూ.25 వేల కోట్లు ప్రభుత్వం బకాయిలు చెల్లించాలని, కానీ కూటమి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించకపోవడం శోచనీయమని తెలిపారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించే పరిస్థితుల్లో లేనందున ప్రత్యామ్నాయంగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను ఇళ్ల స్థలాలుగా కేటాయించి వారికి ఇవ్వాల్సిన బకాయిలు జమ చేసుకోవాలని కోరారు.

వచ్చే వారం

మద్యం బార్ల నోటిఫికేషన్‌

చిత్తూరు అర్బన్‌ : నూతన మద్యం పాలసీ బార్ల కు వచ్చే వారం నోటిఫికేషన్‌ ఇవ్వడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. జిల్లాలో మొత్తం పది మద్యం బార్లు ఉన్నాయి. చిత్తూరులో 7, పలమనేరు, కుప్పం, నగరిలో ఒక్కో మద్యం బారు ఉంది. వీటి లైసెన్సులు ఈనెలాఖరుకు ముగియనుంది. లైసెన్సులను రెన్యువల్‌ చేయడానికి ఇష్టపడని కూటమి ప్రభుత్వం.. నూతన లైసెన్సుల మంజూరుకే మొగ్గుచూపుతూ బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. నూతన పాలసీ ప్రకారం మద్యం బార్లను టెండర్లు పిలిచి, ఓ బారుకు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే లాటరీ పద్దతిలో లైసెన్సులు జారీ చేయనున్నారు. ఇందులో ఓ దుకాణాన్ని కల్లుగీత కులాలకు రిజర్వు చేయనున్నారు. కొత్త పాలసీ ద్వారా దరఖాస్తు రుసుముల నుంచి రూ.50 లక్షలు, లైసెన్సు ద్వారా రూ.5 కోట్ల ఆదాయం సమకూరనుంది. 2028 ఆగస్టు 31వ తేదీ వరకు లైసెన్సులు చెల్లుబాటులో ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement