
కార్వేటినగరంలో తొలి సారిగా వరలక్ష్మీ వ్రతం
తిరుపతి అన్నమయ్యసర్కిల్: కార్వేటినగరంలోని రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయంలో కొలువుతీరిన శ్రీమహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తొలిసారిగా వరలక్ష్మీ వ్రతం ఈ నెల 8 తేదీన ఉదయం 10 నుంచి 12 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి పత్రికా ప్రకటన విడుదల చేశారు. వరలక్ష్మీ వ్రతంలో పాల్గొనదలచిన భక్తులు (ఇద్దరికి) రూ.500 చెల్లించి ఆన్‌లైన్‌్ లేదా ఆఫ్‌లైన్‌లో ఆలయం వద్ద టికెట్లు పొందవచ్చు. వ్రతంలో పాల్గొన్న గృహస్తులకు ఉత్తరీయం, రవికె, లడ్డూ, అప్పం, బ్యాగ్, కుంకుమ, ప్రసాదం బహుమానంగా అందజేయనున్నారు.
6 నుంచి తెప్పోత్సవాలు
కార్వేటినగరంలోని రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయంలో ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు తెప్పోత్సవాలు జరుగనున్నాయి. ఇందులో భాగంగా మొదటి రోజు 6వ తేదీన శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి, 7, 8వ తేదీల్లో రుక్మిణీ, సత్యభామ సమేత వేణుగోపాలస్వామివారు సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు తెప్పలపై విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఈ మూడు రోజులు ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 5 నుంచి 6.30 గంటల వరకు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.
ఫుడ్ కమిషనర్ తనిఖీలు
పలమనేరు: పట్టణంలోని బాలికల గురుకుల పాఠశాల, పౌరసరఫరాలశాల గోడోన్‌ను రాష్ట్ర పుడ్ కమిషన్ సభ్యురాలు దేవీ గంజిమాల మంగళవారం తనిఖీ చేశారు. ఆమేరకు పట్టణ సమీపంలోని అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడారు. వారికి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. భోజన నాణ్యను పరిశీలించారు. పిల్లలతో కలిసి భోజనం చేశారు. ఆపై పక్కనే ఉన్న ఎఫ్‌సీ గోడోన్‌ను తనిఖీ చేసి అక్కడికి వచ్చిన బియ్యం నాణ్యతను పరిశీలించారు. ఆమె తనిఖీ చేసేచోట ముందుగానే ఆయా శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండడంతో అన్నీ చాలా బాగున్నాయంటూ ఆమె కితాబిచ్చి వెళ్లిపోయారు.
నాణ్యమైన సరకులు అందించాలి
బంగారుపాళెం: నిత్యావసర సరుకులు నాణ్యమైనవిగా ఉండాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యురాలు గంజి మాలాదేవి సిబ్బందిని ఆదేశించారు. మండలంలోని మహాసముద్రం గ్రామంలోని రేషన్‌దుకాణం, గుండ్లకట్టమంచి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బంగారుపాళెంలోని ఎస్టీ బాలుర రెషిడెన్షియల్ స్కూల్, ఎస్సీ బాలికల హాస్టల్‌ను ఆమె తనిఖీ చేశారు. రేషన్ దుకాణాల ద్వారా పేదలకు అందిస్తున్న సరకులు, పాఠశాలలు, హాస్టళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసే సరకులు నాణ్యవంతంగా ఉండాలన్నారు.