
బ్రహ్మోత్సవం..బ్రహ్మాండంగా జరిపిద్దాం
● ఈనెల 27 నుంచి కాణిపాక బ్రహ్మోత్సవం ● జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్, ఎస్పీ మణికంఠ చందోలు
కాణిపాకం: బ్రహ్మోత్సవం బ్రహ్మాండంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోలు పిలుపునిచ్చారు. కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం ఈవో కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం అన్ని శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ నెల 27 నుంచి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవ నిర్వహణపై శాఖల వారీగా చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 27 నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు. రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, వైద్య ఆరోగ్య శాఖ, ఇతర సంబంధిత శాఖలు సమన్వయంతో అవసరమైన ఏర్పాట్లకు సంబంధించి ఆలయ ఈఓ అధ్యక్షతన సమన్వయ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీ ద్వారా ప్రాథమిక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. ఆలయం లోపల విద్యుత్ సౌకర్యం లోటుపాట్లపై ముందస్తు పరిశీలన చేయాలన్నారు. కాణిపాక నగరంలో మొబైల్ టాయ్‌లెట్లు ఏర్పాటు చేయాలని, భక్తులకు సురక్షితమైన తాగునీరు అందజేయాలన్నారు. ఆలయ ఉభయదారులతో మంచి సంబంధాలు కలిగి ఉండాలని అధికారులను ఆదేశించారు. ఎస్పీ మాట్లాడుతూ ఆరు రోజుల్లో పటిష్ట బందోస్తు ఉంటుందన్నారు. మిగతా రోజుల్లో అవసరం మేరకు బందోబస్తు చేస్తామన్నారు. సీసీటీవీల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి.. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా 24/7 పర్యవేక్షిస్తామన్నారు. ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ సాధారణ రోజుల్లోనే ఆలయంలో తప్పిదాలు జరుగుతున్నాయన్నారు. విరిగిన పాలు విషయం సీఎం వరకు వెళ్లిందని చెప్పారు. సిబ్బంది నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. వారి విధుల్లో నిర్లక్ష్యం లేకుండా అధికారుల నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. కాణిపాక ఆలయ ఈవో పెంచల కిషోర్, అడిషనల్ ఎస్పీ ఎస్.ఆర్.రాజశేఖర రాజు, ఆర్డీవో శ్రీనివాసులు, డీఎంఅండ్‌హెచ్‌ఓ సుధారాణి, డీపీటీఓ రాము, డీఎస్పీ సాయినాథ్, సీఐ శ్రీధర్‌నాయుడు పాల్గొన్నారు.