
స్మార్ట్ మీటర్లు వద్దు
● వెంటనే రద్దు చేయండి ● వామపక్ష నాయకుల డిమాండ్
చిత్తూరు కార్పొరేషన్: ఎన్నికల ముందు కరెంటు చార్జీలను పెంచబోమని హామీనిచ్చి గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం వాటిని అమలు చేయడం లేదని వామపక్ష నాయకులు విమర్శించారు. మంగళవారం స్థానిక గాంధీవిగ్రహం వద్ద సీపీఐ–సీపీఎం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శులు నాగరాజు, గంగరాజు మాట్లాడారు. విద్యుత్ చార్జీలు పెంచడం లేదంటూనే మరళా ట్రూఅఫ్ పేరుతో రాష్ట్రం పై మరో రూ.12,771 కోట్ల భారాన్ని మోపుతున్నారని దుయ్యబట్టారు. తక్షణం పెంచిన కరెంటు చార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గత ఆర్థికలోటును సాకుగా చూపుతూ ఇష్టారాజ్యంగా కరెంటు బిల్లులు పెంచుకుంటూపోతున్నారని మండిపడ్డారు. సంవత్సర కాలానికి రూ.15,485 కోట్లు సర్దుబాటు చార్జీల భారం మోపారన్నారు. ఇదిగాక ప్రతినెలా యూనిట్‌కు రూ.40 పైసలు చొప్పున సంవత్సరంలోనే రూ.2,787 కోట్లు వసూలు చేశారన్నారు. స్మార్ట్ మీటర్ల వల్ల అదనపు భారం పడనుందని వాపోయారు. సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 24న విద్యుత్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం నిర్వహించి ధర్నా చేస్తామని పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు గిరిధర్ గప్తా, దాసు, ఆనంద్, ప్రతాప్, శ్రీరాములు, గోపీనాథ్, దాసరి చంద్ర, రమాదేవి, విజయగౌరి పాల్గొన్నారు.