
ఏడాది అవుతున్నా నేరవేరని హామీలు
చిత్తూరు కలెక్టరేట్ : కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయినా ఇప్పటి వరకు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం అన్యాయమని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు శివయ్య ఆరోపించారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో ఆ సంఘం ఆధ్వర్యంలో ‘రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయినా ఇంకా ఉద్యోగుల సమస్యలపై స్పందించకపోవడం ఆవేదన కలిగిస్తోందన్నారు. ఇప్పటికే ఉద్యోగులకు సుమారు రూ.25 వేల కోట్ల ప్రభుత్వ బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను ఇళ్ల స్థలాల రూపంలో ఉద్యోగులకు ఇచ్చి వారికి ఇవ్వాల్సిన బకాయిలను జమచేసుకో వాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు తమ సంఘం దృష్టికి సమస్యలను తీసుకొస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నరేష్‌బాబు, కోశాధికారి దేవకుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్ బాలాజీరెడ్డి, సంయుక్త కార్యదర్శులు హరిప్రసాద్, మనోజ్, గౌరీశంకర్, కమర్షియల్ ట్యాక్స్ జిల్లా అధ్యక్షులు పూర్ణం, కార్యదర్శి గిరి, మహిళా విభాగం జిల్లా కార్యదర్శి శైలజ, సౌజన్య, విజయ పాల్గొన్నారు.