
ఎరువుల కొరతపై జనాగ్రహం
చిత్తూరు కలెక్టరేట్ : ‘ఎరువులు లేక అల్లాడుతున్నారు. యూరియా, కాంప్లెక్స్ ఎరువులు దొరక్క రైతులు అవస్థలు పడుతున్నారు. రైతు భరోసా కేంద్రాల జాడే లేకుండా పోయింది. ప్రయివేటు దుకాణాల చుట్టూ చక్కర్లు కొడుతున్నా పట్టించుకోని పరిస్థితి నెలకొంది. విత్తనాలు సైతం సకాలంలో అందడం లేదు. పట్టెడన్నం పెట్టే రైతన్న కష్టాల్లో కూరుకుపోయినా ఈ కూటమి ప్రభుత్వానికి చీమకుట్టినట్టుకూడా లేదు’ అని వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు మండిపడ్డారు. పార్టీ పిలుపు మేరకు ఎరువుల కొరతపై సోమవారం ర్యాలీగా వెళ్లి కలెక్టర్ సుమిత్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి ఆధ్వర్యంలో రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చి తమ సమస్యలను ఏకరువు పెట్టారు.
హైటెక్ మోసం
ఎమ్మెల్సీ, కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త భరత్ మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు మోసాల పర్వం కొనసాగుతోందన్నారు. ఈ తరుణంలో రైతులను సైతం హైటెక్ తరహాలో మోసగిస్తున్నారని మండిపడ్డారు. మాజీ సీఎం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి క్షేత్ర స్థాయిలోకి వచ్చి పర్యటిస్తే తప్ప రైతులకు కూటమి ప్రభుత్వం న్యాయం చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల బంగారుపాళ్యం పర్యటనకు మాజీ సీఎం వస్తే గానీ మామిడి రైతులకు న్యాయం చేయలేదని గుర్తుచేశారు. అన్నదాత సుఖీభవలో సవాలక్ష ఆంక్షలు పెట్టి, కోతలు విధించారని ధ్వజమెత్తారు.
రోడ్డున పడినా స్పందించరెందుకు?
జిల్లా వ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్టపోయి రోడ్డున పడినప్పటికీ కూటమి ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, పూతలపట్టు నియోజకవర్గ సమన్వయ కర్త సునీల్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో రైతులు పూర్తిగా నష్టపోయారన్నారు. గత ఐదేళ్ల పాలనలో మాజీ సీఎం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రైతులను రారాజులుగా తీర్చిదిద్దారని గుర్తుచేశారు. రైతుభరోసా, ఆర్‌బీకే కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు గ్రామ స్థాయిలోనే సేవలందించారన్నారు. ప్రస్తుత కూటమి పాలనలో ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కడం లేదన్నారు. జిల్లాలో యూరియాను అసలు ధరకంటే రూ.200 ఎక్కువగా మార్కెట్‌లో విక్రయిస్తున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ చావా రాజశేఖర్‌రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్, పాలఏకరి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుమార్‌రాజా, రాష్ట్ర మహిళా విభాగం జనరల్ సెక్రటరీ గాయత్రీదేవి, మొదలియార్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానజగదీశ్, ఉద్యోగులు, పెన్షనర్స్ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయసింహారెడ్డి, రైతు నాయకులు కృష్ణారెడ్డి, రాష్ట్ర సోషల్ మీడియా జాయింట్ సెక్రటరీ కిశోర్‌రెడ్డి, పూతలపట్టు, ఐరాల, తవణంపల్లి మండలాల కన్వీనర్లు శ్రీకాంత్‌రెడ్డి, బుజ్జిరెడ్డి, హరిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
ఎరువులు దొరక్క అవస్థలు
డిమాండ్లు ఇవే
రైతులకు వెంటనే ఎరువులను అందుబాటులోకి తీసుకురావాలి. యూరియా కొరతను నివారించాలి.
అధికారులతో అత్యవసర సమావేశాలను ఏర్పాటు చేసి గ్రామస్థాయి వరకు ఎరువులు, విత్తనాల పంపిణీపై దృష్టి పెట్టాలి. గ్రామాల్లోనే రైతు భరోసా కేంద్రాల్లో నిల్వలు పెట్టి అక్కడే రైతులకు సరఫరా చేయాలి.
ఎరువుల బ్లాక్ మార్కెట్‌ను నియంత్రించాలి.
ఎరువుల నిల్వలపై వ్యవసాయశాఖ తనిఖీలు చేపట్టాలి.
ఎరువుల నిల్వలపై ప్రత్యేక యాప్, వెబ్‌సైట్‌లో వివరాలను నమోదు చేయాలి.
ఉచిత పంటల బీమాను వెంటనే అమలు చేయాలి. గత ఏడాది రైతు భరోసా డబ్బుల బకాయిలను వెంటనే చెల్లించాలి. అన్నదాత సుఖీభవ డబ్బులను ఎప్పుడు చెల్లిస్తారో ప్రకటించాలి.
కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకూ ఏటా రూ.20 వేలు చెల్లించాలి
రైత్చు సమస్యలు పరిష్కరించాలంటూ వైఎస్సార్‌సీపీ నేతల ధర్నా
కలెక్టర్‌కు విన్నవించిన నేతలు
కూటమి నిర్లక్ష్యంపై మండిపాటు
జిల్లా వ్యాప్తంగా రైతులు విత్తనాలు, యూరియా, ఎరువులు దొరక్క అవస్థలు ఎదుర్కుంటున్నారని వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ గడిచిన ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం ఏ ఒక్క రైతుకూ చిల్లిగవ్వ ఇచ్చిన పాపాన పోలేదన్నారు. రైతులకు సకాలంలో ఎరువులు, యూరియా, విత్తనాలు ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతులు పండించే ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర దక్కడం లేదన్నారు. జిల్లాలో మామిడి రైతులు గిట్టుబాటు ధర లేక పూర్తిగా నష్టపోయారన్నారు.

ఎరువుల కొరతపై జనాగ్రహం