
ఏమిటీ పెత్తనం వినాయక?
సాక్షి టాస్క్‌ఫోర్స్: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం అత్యంత పవిత్రమైనది. సత్య ప్రమాణాల నెలవుగా ఈ ఆలయానికి పేరుంది. ఇక్కడకు వచ్చే భక్తులు భయం, భక్తితో స్వామిని దర్శించుకుంటుంటారు. ఈ ఆలయ నిర్వహణలో పదుల సంఖ్యలో గ్రామాలు, వందల సంఖ్యలో ఉభయదారులు పాలుపంచుకుంటున్నారు. వీరు పూర్వీకుల ఆచారాలు, కట్టుబాట్లకు భంగం కలగకుండా ఆలయ పవిత్రతను కాపాడుతూ వస్తున్నారు. అయితే ఈ సేవల్లో చిచ్చు పెట్టేందుకు కొందరు టీడీపీ నాయకులు కుట్రలు పన్నుతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
తెరపైకి చంద్రప్రభ వాహన
ఉభయదారుల వివాదం
తరతరాలుగా కాణిపాక బ్రహ్మోత్సవాల్లో జరిగే చంద్రప్రభ వాహనానికి ఉభయదారులుగా కాణిపాకం, చిన్నకాంపల్లి, వడ్రంపల్లి, కారకంపల్లి, ఉత్తర బ్రహ్మణపల్లి, పుణ్య సముద్రం, సంతపల్లి, మారేడుపల్లి, అగరంపల్లి, 45.కొత్తపల్లి, చిగరపల్లి, తిరువణంపల్లి, బొమ్మసముద్రం వాసులు మాత్రమే వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇప్పుడు పట్నం, పైపల్లి, సిద్ధంపల్లి గ్రామాల్లోని కొందరు ఉభయదారులు చేరాలని ప్రయత్నిస్తున్నారు. బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారు కావడంతో ఈ వివాదం మళ్లీ తెరపైకొచ్చింది. గత రెండు రోజులుగా వివాదం తార స్థాయికి చేరింది. ఈ వివాదానికి కొందరు టీడీపీ బడానేతలు ఆజ్యంపోస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. చంద్రప్రభ ఉభయదారులను బెదిరింపులకు గురిచేస్తునట్లు కొందరు ఉభయదారులు ఆరోపిస్తున్నారు.
ప్రజాప్రతినిధి జోక్యం?
ఇక కొత్తగా చేరాలనుకుంటున్న వారికి ఓ ప్రజాప్రతినిధి అండదండలు ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. అలాగే ఆ ప్రజాప్రతినిధి సహాయకుడే మళ్లీ ఈ వివాదానికి కారణమనే వాదనలు గట్టిగా వినిపిస్తున్నారు. ఉభయదారులుగా ఈ మూడు గ్రామాలను చేర్చుకుంటే.. మరిన్ని గ్రామాలు చేరేందుకు సిద్ధంగా ఉన్నాయని, వారిని కూడా చేర్చుకుంటారా..? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ ఉభయదారుల్లో ప్రజాప్రతినిధి, ప్రజాప్రతినిధి సహాయకుడి జోక్యం సమంజసం కాదని ఉభయదారులు ఆగ్రహానికి గురవుతున్నారు. ప్రజాప్రతినిధులు బ్రహ్మోత్సవాన్ని ప్రశాంతంగా జరిపించేందుకు చూడాలే తప్ప.. తరతరాలుగా వస్తున్న ఆచార వ్యవహారాల్లో తలదూర్చడం సమంజసం కాదని మండిపడుతున్నారు. టీడీపీలో మరో వర్గం ఈ చేర్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అధికారులు సైతం తలలు పట్టుకుంటున్నారు.
చంద్రప్రభ ఉభయదారుల్లో టీడీపీ పెత్తనం?
27న కాణిపాక వార్షిక బ్రహ్మోత్సవం ప్రారంభం
14 గ్రామాల్లో చంద్రప్రభ ఉభయదారులు
మరో మూడు గ్రామాలను చేర్చాలని టీడీపీ పట్టు
ఇందులో ఓ ప్రజాప్రతినిధి, ఆయన సహాయకుడి జోక్యం
మండిపడుతున్న కాణిపాకం వాసులు, చంద్రప్రభ వాహనదారులు
తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలకు కొందరు టీడీపీ నేతలు అడ్డు తగులుతున్నారు. పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాలకు భంగం
కలిగిస్తున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రంలో వివాదం సృష్టిస్తున్నారు. ఉభయదారుల మధ్య చిచ్చుపెడుతున్నారు. బ్రహ్మోత్సవం ఖరారు కావడంతో చంద్రప్రభ వాహన ఉభయదారుల్లో వివాదం సృష్టిస్తున్నారు. 14 గ్రామాల్లో ఉన్న చంద్రప్రభ వాహన ఉభయదారుల సంఖ్యను 17 గ్రామాలకు పెంచాలని కొందరు రచ్చరచ్చ చేస్తున్నారు. ఇందులో ఓ ప్రజాప్రతినిధి, ఆయన సహాయకుడు జోక్యం చేసుకుంటున్నారని చంద్రప్రభ వాహన
ఉభయదారులు ఆరోపిస్తున్నారు.