
నేటి నుంచి రాష్ట్ర ఫుడ్ కమిషన్ మెంబర్ పర్యటన
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఈ నెల 5, 6 తేదీల్లో రాష్ట్ర ఫుడ్ కమిషన్ మెంబర్ గంజిమాలాదేవి పర్యటించనున్నట్లు కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ మెంబర్ ఈనెల 5, 6 తేదీల్లో జిల్లాలోని రేషన్‌షాపులు, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాలను తనిఖీ చేయనున్నట్టు కలెక్టర్ వెల్లడించారు.
మరింత నాణ్యతగా లడ్డూలు
కాణిపాకం: భక్తులకు రుచికరమైన లడ్డూను అందజేయాలని ఈవో పెంచలకిషోర్ సిబ్బందిని ఆదేశించారు. కాణిపాక శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలోని లడ్డూ పోటును సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తయారీ పద్ధతులపై ఆరా తీశారు. తయారీలో నాణ్యతను పరిశీలించారు. భక్తులకు రుచికరమైన, పరిశుభ్రతతో కూడిన ప్రసాదాన్ని అందజేయాలని ఆయన అధికారులకు సూచించారు. తనిఖీలో డీఈవో సాగర్‌బాబు, ఏఈవోలు రవీంద్రబాబు, హరిమాధవరెడ్డి, ప్రసాద్ పాల్గొన్నారు.
అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
చిత్తూరు కలెక్టరేట్ : కేంద్ర ప్రభుత్వం అందజేసే ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ అవార్డులకు జిల్లాలో అర్హత, ఆసక్తి గల వారు దరఖాస్తులు చేసుకోవాలని ఐసీడీఎస్ పీడీ వెంకటేశ్వరి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. 2025 సంవత్సరానికి గాను అందజేస్తున్న ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. అదర్శప్రాయమైన పనులు, జాతీయ స్థాయిలో క్రీడలు, సంఘసేవ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, ఆర్ట్స్, లలిత కళలు వినూత్నమైన సేవలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 18 సంవత్సరాల లోపు (31వ తేదీ, జూలై 2025 నాటికి) పిల్లలు అర్హులన్నారు. అర్హత, ఆసక్తి గల వారు www.awards.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఈనెల 15వ తేదీ లోపు దరఖాస్తులను చేసుకోవచ్చన్నారు. ఇతర వివరాలకు కలెక్టరేట్‌లోని ఐసీడీఎస్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
రేపు జిల్లా స్థాయి క్రీడాపోటీలు
చిత్తూరు కలెక్టరేట్ : చిత్తూరులో ఈనెల 6, 7 తేదీల్లో జిల్లా స్థాయి క్రీడాపోటీలు నిర్వహించనున్నట్లు క్రీడాభివృద్ధి అధికారి బాలాజీ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. చిత్తూరు జిల్లా కేంద్రంలోని మెసానికల్ మైదానంలో ఈ నెల 6, 7 తేదీల్లో జిల్లా స్థాయి పోటీలు నిర్వహిస్తామన్నారు. ఆర్చరి, వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, అథ్లెటిక్స్, హాకీ, వాలీబాల్, బాస్కెట్‌బాల్, కబడ్డి, ఖోఖో, షటిల్ తదితర పోటీలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. జిల్లా స్థాయిలో గెలుపొందే క్రీడాకారులు ఈ నెల 12, 13 తేదీల్లో తిరుపతిలోని ఎస్వీయూ స్పోర్ట్స్ కాంప్లెక్సులో నిర్వహించే పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ పోటీల్లో 18 నుంచి 21 సంవత్సరాల లోపు బాలబాలికలు అర్హులని వెల్లడించారు.
పరిశ్రమల ఏర్పాటుకు
స్థల పరిశీలన
శ్రీరంగరాజపురం : మండలంలో పరిశ్రమల ఏర్పాటు కోసం పాతపాళ్యం గ్రామం 52 కనికాపురం వద్ద రాష్ట్ర పరిశ్రమల కార్పొరేషన్ జోనల్ మేనేజర్ స్థల పరిశీలన చేశారు. ఆయన మాట్లాడుతూ పాతపాళ్యం గ్రామం వద్ద పరిశ్రమల ఏర్పాటు కోసం స్థలం అనుకూలంగా ఉందన్నారు. ఈ మేరకు ర్యూట్ మ్యాప్ సిద్ధం చేయాలని తలహసీల్దార్‌ను ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ లోకనాథపిళ్‌లై, మండల సర్వేయర్ సురేష్, నాయకులు భాస్కర్‌నాయుడు, బాలజీ నాయుడు ఉన్నారు.