
నగరి–దిండివనం రైలు కూత
● 19 ఏళ్లుగా ఊరిస్తున్న రైల్వేలైన్‌కు మోక్షం
● కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు
● నగరిలోఎట్టకేలకు పనులు ప్రారంభం
నగరి : ఏళ్ల తరబడి నత్తనడకన సాగుతున్న నగరి–దిండివనం రైల్వేలైను ప్రాజెక్టుకు ఈఏడాది కేంద్ర బడ్జెట్‌లో రూ.350 కోట్లు కేటాయించడం, టెండర్లు పూర్తవడంతో నగరి నుంచి రైల్వేలైన్ పనులకు మోక్షం లభించింది. 2006లో రైల్వేశాఖ ప్రకటించిన దిండివనం–నగరి రైల్వేలైన్ ప్రాజెక్టు 19 ఏళ్లుగా ప్రజలను ఊరిస్తూనే వస్తోంది. ఏళ్ల తరబడి నత్తనడకన సాగుతున్న ప్రాజెక్టుకు ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో రూ.350 కోట్లు కేటాయించడం, టెండర్లు పూర్తవడంతో నగరి నుంచి రైల్వేలైన్ పనులు ప్రారంభమయ్యాయి.
తమిళనాడు విల్లుపురం తిరువణ్ణామలై, వెల్లూరు నుంచి తిరువళ్లూరు జిల్లాకు రైలు మార్గాన్ని అనుసంధానం చేసేందుకు 2006లో రైల్వేశాఖ దిండివనం–నగరి రైల్వేలైన్ ప్రాజెక్టును ప్రకటించింది. ఇందులో భాగంగా విల్లుపురం జిల్లోలోని దిండివనం నుంచి రేణిగుంట – అరక్కోణం సెక్షన్‌లోని నగరి వరకు 184.5 కిలోమీటర్ల మేర కొత్త రైల్వేలైన్ నిర్మించేందుకు 2008లో 582.83 కోట్లు ప్రాజెక్టు వ్యయంగా నిర్ణయించి 2020లోపు పూర్తి చేసేందుకు రూ.20 కోట్ల నిధులు ఆ ఏడాది విడుదల చేశారు. ఆ నిధులతో 6 కిలోమీటర్ల మేర పనులు జరిగినా ఆపై భూసేకరణలో సమస్యలు ఎదుర్కొంటూ వస్తున్న ఈ ప్రాజుక్టుకు ఆపై పెరిగిన వ్యయాలు అందుకు తగ్గ నిధుల కేటాయింపు అనే అంశం భారంగా మారింది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక 2020 నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వాలాజా రోడ్డు నుంచి రాణిపేట వరకు ఎలక్ట్రిఫికేషన్‌తో పాటు పట్టాల ఏర్పాటు పనులు వేగంగా జరిగాయి. ఆపై భూసేకరణ సమస్యతో పాటు నిధుల సమస్య వెంటాడి పనులు మందగించింది. 2024 నాటికి ప్రాజక్టు వ్యయం 3361 కోట్లకు చేరగా మార్చి 31, 2027 నాటికి పూర్తి చేయాలని మళ్లీ లక్ష్యం నిర్ణయించారు. ఇప్పటివరకు 81శాతం భూసేకరణ పూర్తయింది.
33 కి.మీ రైల్వేలైన్ పనులు ప్రారంభం
ఈ ఏడాది కేటాయించిన బడ్జెట్‌కు సంబంధిత టెండర్లు పూర్తవడంతో 33 కిలోమీటర్ల మేర రైల్వేలైన్ నిర్మించేందుకు రైల్వేశాఖ సిద్దమైంది. నగరి నుంచి పొదటూరుపేట వరకు 13 కిలోమీటర్లు, వాలాజా రోడ్డు నుంచి షోళింగర్ వరకు 20 కిలోమీటర్ల మేర రైల్వేలైన్ నిర్మించనున్నారు. సంబంధిత పనులు నగరిలో ప్రారంభమై వేగంగా జరుగుతున్నాయి.
22 స్టేషన్లను కలిపే మార్గం
రైలు మార్గం దిండివనం, వెల్లిమేడుపేట, తెల్లార్, వంధవాసి, మాంబాక్కం, ఎరుమైవెట్టి, చెయ్యార్, ఇరుంగూర్, మామండూరు, ఆరణి, తామరైపాక్కం, తిమిరి, ఆర్కాట్, రాణిపేట నుంచి వాలాజా రోడ్డు జంక్షన్‌న్ మీదుగా కొడక్కల్, షోళింగర్, ఆర్‌కే పేట, అత్తిమాంజేరిపేట, పళ్లిపట్టు, పొదటూరుపేట మీదుగా నగరి వరకు చేరుకుంటుంది. ఏపీలోని నగరి వెళ్లేలా ప్లాన్ చేశారు. ఈ మార్గంలో 3 జంక్షన్లు, 13 క్రాసింగ్‌లు, 9 హాల్టులు ఉండే విధంగా పథక రచన చేశారు. 22 స్టేషన్లలో 18 కొత్త స్టేషన్లు రానున్నాయి. 26 మేజర్ వంతెనలు, 200 మైనరు వంతెనలు నిర్మించనున్నారు.
ప్రాజెక్టు పూర్తయితే
ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఇది దక్షిణ రైల్వేలో మరో ముఖ్యమైన అనుసంధాన రైల్వే లైన్ అవుతుంది. ప్యాసింజర్, సరుకు రవాణా రైళ్లు విల్లుపురం నుంచి అరక్కోణం లేదా చైన్నెకి రావలసిన అవసరం ఉండదు. వాలాజా రోడ్ నుంచి నగరి మీదుగా రేణిగుంట మార్గంలో వెళతాయి. ముంబై, ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.

నగరి–దిండివనం రైలు కూత