
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం చిత్తూరు నగరం మురకంబట్టు ప్రాంతంలో చోటు చేసుకుంది. తాలూకా పోలీసుల వివరాల మేరకు...తవణంపల్లి మండలం టి.పుత్తూరు గ్రామానికి చెందిన పృధ్వీ (28) బెంగళూరులోని సాప్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇతడు ఏడాది కిందట మురకంబట్టుకు చెందిన నవ్య అనే యువతిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. అప్పుల భారం పెరగడంతో బెంగుళూరు నుంచి వచ్చేశాడు. మురకంబట్టులోని భార్య ఇంట్లోనే ఉంటున్నాడు. శనివారం ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి గోవిందయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఒంటరి ఏనుగు సంచారం
పాకాల: మండలంలోని చింతలవంక, వళ్లివేడు పరిసర ప్రాంతాల్లో ఒంటరి ఏనుగు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు ఆదివారం గుర్తించారు. వారు మాట్లాడుతూ స్థానిక గ్రామాలతోపాటు కొమ్మిరెడ్డిగారిపల్లి క్రాస్‌రోడ్డు నుంచి కొత్తపల్లికి వెళ్లే రోడ్డు మార్గంలో రాత్రి పూట ప్రయా ణం చేయకూడదని సూచనలు చేశారు. రాత్రి సమయాల్లో కాకర్లవారిపల్లి, మొరవపల్లి, పుల్లావాండ్లపల్లి, కొండకిందపల్లి, నడుంపల్లి, పరిసర ప్రాంతాల్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నా యని రైతులు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. రాత్రి సమయాల్లో రైతులు పొలాల వద్ద బస చేయడం, వ్యవసాయ పనులు చేయడం వంటివి చేయకూడదని, చీకటి పడిన తరువాత పొలాల నుంచి ఇంటికి వచ్చేయాలని, ఒంటరి ఏనుగు సంచారంపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఏనుగు సంచారంపై సమాచారాన్ని 8309255631 నంబర్‌కు తెలియజేయాలని అటవీశాఖ అధికారులు కోరారు.
ద్విచక్ర వాహనం అదుపు తప్పి ఇద్దరికి గాయాలు
రొంపిచెర్ల : ద్విచక్ర వాహనం అదుపు తప్పి ఇద్దరికి తీవ్ర గాయలైన సంఘటన మండలంలోని పెద్దగొట్టిగల్లు సమీపంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. రొంపిచెర్ల మండలం బోడిపాటివారిపల్లెకు చెందిన గణేష్ (28), చిన్న గొట్టిగల్లు మండలం జంగావాండ్లపల్లెకు చెందిన రమేష్ (45), ఇరువురు ద్విచక్ర వాహనంలో పీలేరు నుంచి స్వగ్రామాలకు వెళుతుండగా పెద్దగొట్టిగల్లు సమీపంలోని రెడ్డి చెరువు వద్ద అదుపు తప్పి రోడ్డు మీద పడ్డారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గణేష్ పరిస్థితి విసమంగా ఉండడంతో రుయా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.