
సోపుల పేరుతో బురిడీ
గంగవరం : నాసిరకం సోపులతో గ్రామాల్లో సంచరించే ఓ అజ్ఞాత వ్యక్తి సోపులు కొంటే బహుమతి గ్యారెంటీ అంటూ ప్రజలను నమ్మించాడు. మూడు సోపులు కొంటే ఏదో ఒకటి గిఫ్ట్ లభిస్తుందనే మాటలకు ఓ వ్యక్తి మోసపోయాడు. కేటుగాడి వద్ద సోపులు కొని రూ. 10 వేలు పోగొట్టుకున్న సంఘటన మండలంలో శనివారం ఆలస్యంగా వెలుగు చూసింది. మండలంలోని గోవిందశెట్టిపల్లి గ్రామానికి చెందిన బాధితుడు మురళి తెలిపిన వివరాల మేరకు.. గతనెల 24వ తేదీన బెంగళూరుకి చెందిన ఓ కంపెనీ పేరిట ఆ గ్రామంలో సోపులు విక్రయిస్తున్న నకిలీ కేటుగాడి వద్ద మూడు సోపులు కొన్నట్టు తెలిపారు. ఒక సోపు కవర్‌లో ఏకంగా బైక్ ప్రైజ్ కొట్టడంతో రిజిస్ట్రేషన్ ఖర్చులకు రూ.10 వేలు ముందుగా చెల్లించాలని చెప్పాడన్నారు. డబ్బు చెల్లిస్తే బైక్‌ను రిజిస్ట్రేషన్‌తో సహా ఈనెల 1వ తేదీన అందజేస్తానని చెప్పడంతో మాయమాటలకు నమ్మి నగదు చెల్లించి మోసపోయాడు. అనంతరం తన వద్ద డబ్బు తీసుకుని వెళ్లిన వ్యక్తి ఫోన్ స్విచ్ఛాప్ చేసి అదృశ్యమయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై బాధితుడు గంగవరం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య
బంగారుపాళెం : అప్పుల బాధ తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం మండలంలోని తంబుగానిపల్లెలో చోటు చేసుకుందని సీఐ శ్రీనివాసులు తెలిపారు. గ్రామానికి చెందిన సురేంద్రనాయుడు కుమారుడు మధుసూదన్‌నాయుడు(37) పశువుల కొనుగోలు, షెడ్డు నిర్మించుకునేందుకు సుమారు రూ.35 లక్షల వరకు అప్పు చేసినట్లు తెలిపారు. ఆ అప్పులు తీర్చలేక మనస్తాపానికి గురై గ్రామ సమీపంలో మామిడి తోటలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతుడి భార్య మహాలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

సోపుల పేరుతో బురిడీ