
సైబర్ దాడులపై అప్రమత్తంగా ఉండాలి
● జిల్లా పరిషత్‌లో భద్రత అంశాలపై సమావేశం ● పాల్గొన్న కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్యాలయాల్లో ప్రజలకు స్పష్టంగా కనిపించేలా అత్యవసర నంబర్లను ప్రదర్శించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అన్నారు. శనివారం జిల్లా పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్యాలయాల భద్రతపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. బ్యాంకింగ్ వ్యవస్థపై నిరంతరం పెరుగుతున్న సైబర్ దాడులపై అప్రమత్తంగా ఉంటూ అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. సైబర్ దాడుల నేపథ్యంలో బ్యాంకర్లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈకేవైసీ ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలన్నారు. సైబర్ మోసాల పై ప్రజలకు నిత్యం అవగాహన కల్పించాలన్నారు. సైబర్ మోసాలు జరిగిన వెంటనే స్థానిక పోలీసులకు తెలిసేలా అంతర్గత లింకింగ్ మెకానిజం ఉండాలన్నారు. ఇంటర్‌నెట్, బ్యాంకింగ్, యూపీఐ లావాదేవీలపై ఏఐ ఆధారిత మానిటరింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలన్నారు. డ్యూయల్ ఆథరైజేషన్ విధానం తప్పనిసరిగా పాటించాలన్నారు. నెలకు కనీసం ఒకసారి సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు. ఎస్పీ మణికంఠ చందోలు మాట్లాడుతూ.. బ్యాంకులు, ఏటీఎంల వద్ద గరిష్ట భద్రత ముఖ్యమన్నారు. నిబంధనలను అనుసరించి భద్రతా చర్యలు పాటించాలని ఆదేశించారు. బ్యాంకులు, ఏటీఎం ల వద్ద 24 గంటల పాటు ఆయుధాలతో ఉన్న భద్రతా సిబ్బంది విధులు నిర్వహించాలన్నారు. రాత్రి వేళల్లో అధిక ప్రమాదం ఉన్న శాఖల వద్ద ప్రత్యేక సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. గార్డులు రొటేషన్ విధానంలో విధులు నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్నారు. బ్యాంకుల వద్ద అలారాలను పోలీస్ స్టేషన్, భద్రతా సంస్థలతో అనుసంధానం చేయాలన్నారు. సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ హరీష్, ఏఎస్పీ రాజశేఖర్‌రాజు, డీఎస్పీలు ప్రభాకర్, పార్థసారధి,జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల మేనేజర్‌లు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
రెవెన్యూ, పోలీసు శాఖల తనిఖీల్లో గుర్తించిన లోపాలు
కొన్ని బ్యాంకుల్లో ముందు, వెనుక భాగాల్లో సీసీటీవీ పర్యవేక్షణ లేకపోవడం. ఫైర్ అలారమ్ వ్యవస్థ లేకపోవడం. ఉన్నా పనిచేయకపోవడం. ఆధునిక సీసీటీవీలు కాకుండా పాత రకాల కెమెరాలు ఉండటం. అలారమ్ సిస్టమ్ పనిచేయకపోవడం వంటివి గుర్తించినట్లు తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా అన్ని బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ తక్షణమే భద్రతా లోపాలను సరిదిద్దాలి.
నెలకు కనీసం ఒకసారి ఇంటర్నల్ సెక్యూరిటీ రివ్యూలు నిర్వహించాలి.
అన్ని శాఖలు పోలీసు శాఖకు భద్రతా అంశాల్లో పూర్తి సహకారం అందించాలి.
సైబర్ అవగాహన ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి.