
కాణిపాకం అన్నదాన ట్రస్టుకు విరాళాలు
కాణిపాకం : కాణిపాకంలోని వరసిద్ధివినాయక స్వామి దేవస్థాన నిత్య అన్నదాన ట్రస్టుకు శనివారం ఇద్దరు దాతలు నగదు విరాళం చేశారు. బెంగుళూరుకు చెందిన వెంకట దినకర్ రూ. లక్ష విరాళంగా ఇచ్చారు. అలాగే తిరుపతికి చెందిన తోట శ్రీహరి రూ. 2 లక్షలు విరాళంగా అందజేశారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనభాగ్యం కల్పించి ప్రసాదం అందజేశారు.
అదనపు లోడ్ రాయితీ గడువు పొడిగింపు
చిత్తూరు కార్పొరేషన్ : గృహ వినియోగదారులకు అదనపులోడ్‌పై ఇస్తున్న రాయితీ గడువును పొడిగించారని ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. గతంలో జూన్ 30 వరకు స్వచ్ఛందంగా అదనపు లోడ్ క్రమబద్ధీ కరించుకునే సర్వీసులకు గడువు ఉండేదన్నారు. ప్రస్తుతం ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు గృహ సర్వీసుదారులు కిలోవాట్‌పై 50 శాతం రాయితీతో పైకం చెల్లించే విధంగా అవకాశం కల్పించారన్నారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
నవోదయ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతి సిటీ: జవహర్ నవోదయ విద్యాలయలో 2026 –2027 విద్యా సంవత్సరానికి సంబంధించి 9వ, 11వ తరగతి ప్రవేశానికి జాతీయ స్థాయిలో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాద్యక్షులు డాక్టర్ విశ్వనాథ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రవేశ పరీక్షకు 2025–2026 విద్యా సంవత్సరంలో ఏదైనా ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు 9వ తరగతిలోనూ, పదో తరగతి చదువుతున్న విద్యార్థులు 11వ తరగతి ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. దరఖాస్తుల సమర్పించడానికి సెప్టెంబర్ 23 వతేదీ చివరి రోజు అని తెలిపారు. మరిన్ని వివరాలకు 8688888802, 9399976999 నంబర్లలో కానీ వరదరాజనగర్‌లోని విశ్వం సైనిక్ నవోదయ పోటీ పరీక్ష సమాచార కేంద్రంను సంప్రదించాలని కోరారు.