
ఎస్వీయూలో బీటెక్ ( స్వీడన్ ) ప్రవేశాలకు ఆహ్వానం
తిరుపతి సిటీ : ఎస్వీయూ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ (స్వీడన్) కంప్యూటర్ సైనన్స్ ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య భూపతి నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం– స్వీడన్‌లోని ‘బ్లెకింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’తో జరిగిన పరస్పర అంగీకార ఒప్పందం ప్రకారం ఎస్వీయూ బీటెక్ నాలుగేళ్ల కోర్సు కొనసాగుతోందని తెలిపారు. అయితే ఈ ప్రోగ్రాం మూడేళ్లు ఎస్వీయూలో, ఒక సంవత్సరం స్వీడన్‌లోని బెక్లింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో విద్యార్థులు చదవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కావున 2025–26 విద్యా సంవత్సరానికి ఈ ప్రోగ్రాంలో చేరదలచిన విద్యార్థులు ఈనెల 4 వ తేదీ నుంచి 14 వతేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. వర్సిటీ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్ల విభాగం ద్వారా ఆసక్తిగల విద్యార్థులు ఈ కోర్సులో ప్రవేశాలు పొందవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.
శ్రీవారి దర్శనానికి 15 గంటలు
తిరుమల: తిరుమల క్యూకాంప్లెక్స్‌లో 12 కంపార్ట్‌మెంట్లు నిండాయి. బుధవారం అర్ధరాత్రి వరకు 75,303 మంది స్వామివారిని దర్శించుకోగా 27,166 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.99 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 15 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.