
రాజనాల బండ.. న్యాయానికి అండ
– 50 గ్రాముల బంగారు నగలు అప్పగింత
చౌడేపల్లె : సత్య ప్రమాణాలకు నిలయమైన రాజనాలబండ ప్రసన్నాంజనేయ స్వామి పేరు చెప్పి దేవుడి మహిమ చెప్పగా చోరీ చేశామని నేరం అంగీకరించి సుమారు 50 గ్రాముల బంగారు నగలు ఇచ్చేశారని భక్తులు శనివారం తెలిపారు. బాధితులు భాస్కర్, వేదవతి దంపతుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఐరాల మండలం పోతపోల ఇండలకు చెందిన భాస్కర్, వేదవతి దంపతుల ఇంట్లో రెండు నెలల క్రితం చోరీ జరిగింది. బీరువాలోని 50 గ్రాముల బంగారు, నగదు రూ.10 వేలు చోరీ అయ్యాయి. పెద్ద మనుషుల చేత పంచాయితీ నిర్వహించి రాజనాల బండలో ప్రమాణం చేయాలని తీర్మానించారు. 2వ తేదీ శనివారం ప్రమాణం చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం ఉదయం ఇంటికొక మనిషి రాజనాల బండకు ప్రమాణం చేయడానికి బయలు దేరాల్సి ఉండగా నేరం తామే చేశామని అంగీకరించి నగలు తెచ్చి ఇవ్వడంతో బాధితులు పెద్దమనుషులకు నగల విషయాన్ని తెలిపి కుటుంబ సభ్యులతో ఆలయం వద్దకు చేరుకొని పూజలు చేశారు.
ప్రత్యేక అలంకరణలో స్వామి వారు
సత్య ప్రమాణాలకు నిలయమైన రాజనాలబండలో వెలసిన శ్రీ వీరాంజనేయస్వామి ఆలయంలో శ్రావణ మాసపు రెండవ శనివారం పురస్కరించుకొని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఏటా శ్రావణ మాసం చివరి శనివారం, ఆదివారం రోజున వైభవంగా 13 మూడు గ్రామాల ప్రజలు రాజనాలబండలో ఉట్లొత్సవం, తిరుణాల నిర్వహించనున్నారు.