
బస్సు కోసం రోడ్డెక్కిన విద్యార్థులు
యాదమరి: రద్దయిన బస్సును పునరుద్ధరించాలని కోరుతూ విద్యార్థులు, రైతులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేసిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని తెల్లరాళ్ల పల్లి పంచాయతీ గొందివాళ్లవూరుకు గతంలో రోజూ ఉదయం, సాయంత్రం ఆర్టీసీ బస్సు సదుపాయం ఉంది. దీంతో చదువుకోవడానికి విద్యార్థులు, పంటలను విక్రయించుకోవడానికి రైతులు చిత్తూరుకు రాకపోకలు సాగించేవారు. అయితే ఈ విద్యాసంవత్సరం మొదలైనప్పటి నుంచి సరైన ఆక్యుపెన్సీ లేకపోవడంతో ఆర్‌టీసీ అధికారులు బస్సు సేవలను రద్దు చేశారు. దీంతో అప్పటినుంచి విద్యార్థులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రద్ధయిన బస్సును పునరుద్ధరించాలని కోరుతూ విద్యార్థుల తల్లిదండ్రులు, రైతులు పలుమార్లు ఆర్‌టీసీ అధికారులను కలిసి విన్నవించారు. అయితే వారు స్పందించకపోవడంతో శనివారం ఉదయం పట్రపల్లి క్రాస్ వద్ద గొందివాళ్లవూరు, పట్రపల్లి, కొలనంపల్లి, పెరగాండ్లపల్లి గ్రామాలవాసులు ధర్నాకు దిగారు. దీంతో రోడ్డుపై దాదాపు రెండు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించి వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి ప్రయాణికులు అవస్థలు పడ్డారు. సమాచారం అందుకున్న ఆర్‌టీసీ అధికారులు రద్దయిన బస్సును పునరుద్దరిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.