
కంటైనర్ కిందకు దూసుకెళ్లిన కారు
– వెనుక నుంచి ఢీకొన్న లారీ
బంగారుపాళెం : మండలంలోని మొగిలి ఘాట్ వద్ద శనివారం చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. నెల్లూరుకు చెందిన చంద్రశేఖర్‌రెడ్డి అతడి భార్య మంజుల, సోదరుడి కుమారుడు సంగీత్‌రెడ్డి బెంగళూరులో శుక్రవారం బంధువుల ఇంటిలో జరిగిన శుభ కార్యానికి వెళ్లారు. శనివారం ఉదయం 8 గంటలకు బెంగళూరు నుంచి నెల్లూరుకు కారులో బయలుదేరారు. మార్గ మధ్యలో మొగిలి ఘాట్‌లోని దొరచెరువు వద్ద కారును వెనుక నుంచి లారీ ఢీకొనడంతో ముందు పోతున్న కంటైనర్ కిందకు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను హైవే అంబులెన్స్ వాహనంతో చికిత్స నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చంద్రశేఖర్‌రెడ్డి, మంజులను మెరుగైన వైద్యం కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.