● మార్చి 3న జిల్లావ్యాప్తంగా పోలీయో చుక్కలు వేసే కార్యక్రమం ● జిల్లాలో 0–5 ఏళ్లలోపు 2,09,971 పిల్లల గుర్తింపు
చిత్తూరు రూరల్: జిల్లావ్యాప్తంగా మార్చి 3వ తేదీన పల్స్ పోలియో కార్యక్రమానికి జిల్లా అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు అధికారులు శరవేగంగా కసరత్తు చేశారు. జిల్లాలో 2,09,971 మందికి పంపిణీ పల్స్ పోలియో చుక్కులు వేసేలా ప్రణాళికలు రూపొందించారు. ‘పల్స్ పోలియో’ విజయవంతానికి సంబంధించి ఇప్పటికే డీఎంహెచ్ ప్రభావతిదేవి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి రవిరాజు, మెడికల్ ఆఫీసర్లు, ఇతర అధికారులకు శిక్షణ ఇచ్చారు.
మూడు దశల్లో..
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఉండే చిన్నారులకు 3 దశల్లో పోలియో చుక్కలు వేయనున్నారు. అందుకోసం జిల్లాలో 1,415 బూత్‌లను ఏర్పాటు చేస్తున్నారు. మెడికల్ ఆఫీసర్లు 112 మంది, కోర్ గ్రూప్ ఆఫీసర్లు 08, సూపర్‌వైజర్లు 1530, ఆశా వర్కర్లు–1,989, ఏఎన్‌ఎంలు–612 మంది పాలుపంచుకోనున్నారు. 206 మొబైల్ బృందాలు హైరిస్క్ ప్రాంతాల్లో పర్యటించనున్నాయి. బస్టాండ్లు, రైల్వే స్టేషన్, ప్రధాన కూడళ్లు తదితర ప్రాంతాల్లో పోలియో చుక్కలు వేస్తారు. ఒకవేళ ఎవరైనా తమ చిన్నారికి మార్చి 3న చుక్కలు వేయించకుంటే తర్వాత రెండు రోజులు ఆశా, ఏఎన్‌ఎంలు ఆ ఇళ్లకే వెళ్లి వేసేలా ఏర్పాట్లు చేశారు.
లక్ష్యాన్ని పూర్తి చేస్తాం..
మార్చి 3న జిల్లావ్యాప్తంగా పోలియో చుక్కల పంపిణీని ప్రారంభిస్తాం. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశాం. మార్చి 4, 5 తేదీల్లో ఆరోగ్యశాఖ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేస్తారు. తల్లిదండ్రులు బాధ్యతగా చిన్నారులకు చుక్కల మందు వేయించాలి. వందశాతం లక్ష్యం పూర్తయ్యేలా అధికారులు సమిష్టిగా పనిచేయాలి.
– రవిరాజు, డీఐఓ, చిత్తూరు