ఒక్కరే మిగిలారు

నామినేషన్ల పరిశీలనలో రిటర్నింగ్‌ అధికారి వెంకటేశ్వర్‌  - Sakshi

అధికారిక ప్రకటనే తరువాయి!

సాక్షి, చిత్తూరు : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏకపక్షంగా మారింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సిపాయి సుబ్రమణ్యం నామినేషన్‌ ఒక్కటే మిగలడంతో ఈ స్థానం ఏకగ్రీవం కానుంది. ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకారం శుక్రవారం కలెక్టరేట్‌లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లను రిటర్నింగ్‌ అధికారి, జేసీ వెంకటేశ్వర్‌ పరిశీలించారు. మధ్యాహ్న వరకు కొనసాగిన పరిశీలనలో సిపాయి సుబ్రమణ్యం సమర్పించిన పత్రాలు అన్నీ పక్కాగా ఉండడంతో నామినేషన్‌ను ఆమోదించారు. స్వతంత్ర అభ్యర్థి ధనంజయయాదవ్‌ నామినేషన్‌లో సక్రమంగా వివరాలు లేకపోవడంతో తిరస్కరించారు. దీంతో సిపాయి సుబ్రమణ్యం ఒక్కరే బరిలో మిగిలారు. ఈ క్రమంలో ఈ నెల 27వ తేదీన ఎమ్మెల్సీగా ఎన్నికై న అభ్యర్థిని ప్రకటించనున్నట్లు జేసీ వెల్లడించారు.

వార్‌ వన్‌ సైడ్‌!

ఉమ్మడి చిత్తూరు జిల్లావ్యాప్తంగా స్థానిక సంస్థల్లో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులే అధికంగా ఉన్నారు. దీంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గెలుపు నల్లేరుపై నడకే అని పలువురు విశ్లేషకులు వెల్లడించారు. ఈ క్రమంలో ఆ పార్టీ అభ్యర్థి సిపాయి సుబ్రమణ్యం నామినేషన్‌ ఒక్కటే మిగలడంతో వార్‌ వన్‌సైడ్‌గా మారిందని వివరించారు.

కేడర్‌లో జోష్‌
వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సునాయాసంగా గెలుస్తుండడం వైఎస్సార్‌సీపీ కేడర్‌లో ఉత్సాహం నింపింది. 2019 నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ హవా నడిచిన క్రమంలో ఇది రాబోయే సార్వత్రిక ఎన్నికల్లోనూ కార్యకర్తలకు మరింత బూస్టప్‌ ఇస్తుందని నేతలు భావిస్తున్నారు.

పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రభావం

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రభావం త్వరలోనే జరగనున్న టీచర్‌, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై పడనుంది. సిపాయి సుబ్రమణ్యం ఏకగ్రీవంగా గెలుస్తున్న క్రమంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు మరింత ఉత్సాహంతో పనిచేసే అవకాశముంది. వైఎస్సార్‌సీపీ బలపరిచిన పేర్నాటి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డిని గెలిపించుకునేందుకు పార్టీ ప్రజాప్రతినిధులు సైతం సమష్టిగా పనిచేస్తున్నట్లు పలువురు నేతలు వెల్లడిస్తున్నారు.

బీసీలకు స్వర్ణయుగం

జగనన్న పాలనలో బీసీలకు స్వర్ణయుగం వచ్చిందన్నారు. నాపై నమ్మకంతో ఎమ్మెల్సీగా నిలబెట్టిన ముఖ్యమంత్రికి రుణపడి ఉంటా. వెనుకబడిన వర్గాలకు చెందిన అన్ని కులాల వారికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే న్యాయం జరిగింది.

– సిపాయి సుబ్రమణ్యం, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి

పట్టభద్రులు 23..  ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానానికి 8 నామినేషన్లు

చిత్తూరు కలెక్టరేట్‌: ఉమ్మడి ప్రకాశం–నెల్లూరు–చిత్తూరు జిల్లాల పట్టభద్రులు, టీచర్‌ ఎమ్మెల్సీ స్థానాలకు దాఖలు చేసిన నామినేషన్లను శుక్రవారం కలెక్టరేట్‌లో క్షుణ్ణంగా పరిశీలించారు. అబ్జర్వర్లు కాటమనేని భాస్కర్‌, కోన శశిధర్‌లు, అభ్యర్థుల సమక్షంలో ఎన్నికల అధికారి హరినారాయణన్‌ నామినేషన్ల పరిశీలన చేపట్టారు. ఆమోదం పొందిన, తిరస్కరించిన అభ్యర్థుల జాబితాను మధ్యాహ్నం 3 గంటలకు నోటీస్‌ బోర్డులో పెట్టారు. ఈ నెల 27వ తేదీన బరిలో మిగిలిన అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు. డీ ఆర్‌ఓ రాజశేఖర్‌, ఏఓ కులశేఖర్‌, సూపరింటెండెంట్లు మురళి, వెంకటేశ్వర్‌, శేషగిరి, డీఎస్పీలు శ్రీనివాసమూర్తి, తిప్పేస్వామి, సీఐలు మద్ధయ్య ఆచారి, నరసింహరాజు పాల్గొన్నారు.

ఆమోదం.. తిరస్కరణ

నామినేషన్ల పరిశీలన అనంతరం పట్టభద్రులకు సంబంధించి 30కి గాను 23 నామినేషన్లను ఆమోదించారు.వివిధ కారణాలతో 7 నామినేషన్లు తిరస్కరించారు. ఉపాధ్యాయుల స్థానానికి 8 నామినేషన్‌లకు గాను 8 ఆమోదం పొందాయని అధికారులు ప్రకటించారు.

Read latest Chittoor News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top