2015లో కఠారి దంపతుల హత్య ఐదుగురిని దోషులుగా తేల్చిన కోర్టు
తీర్పు చెబుతుండగానే కోర్టులో కఠారి కుమార్తె కన్నీళ్లు
ఐదు పేజీల తీర్పులో 11 అంశాలు ప్రస్తావన
దాదాపు పదేళ్ల నిరీక్షణకు తెరపడింది. చిత్తూరులో సంచలనం కలిగించిన కఠారి దంపతుల హత్య కేసులో అంతిమ తీర్పు వెలువడింది. సుదీర్ఘ విచారణ తర్వాత న్యాయస్థానం దోషులకు మరణ దండన విధించింది. శ్రీరామ్ చంద్రశేఖర్(చింటూ), వెంకటాచలపతి, జయప్రకాష్‌రెడి, మంజునాథ్, వెంకటేష్ చనిపోయేంత వరకు ఉరి తీయాలని న్యాయమూర్తి డా.ఎన్.శ్రీనివాసరావు తీర్పునివ్వడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

చిత్తూరు అర్బన్: చిత్తూరులోని 9వ అదనపు జిల్లా సెషన్స్ న్యాయస్థానంలో శుక్రవారం ఉదయం 10.35 గంటలకు 110/2016 అంటూ పిలిచారు. అప్పటికే జనంతో నిండిపోయిన కోర్టు హాలులో దోషులను ప్రవేశపెట్టగానే మొత్తం నిశ్శబ్దంగా అలముకుంది. న్యాయమూర్తి ఏం తీర్పు చెబుతారోనంటూ అందరిలోనూ ఉత్కంఠ. ఒక్కసారిగా దోషులు ఐదుగురికికి ఉరిశిక్ష విధిస్తున్నట్లు న్యాయమూర్తి తన వద్ద ఉన్న ఐదు పేజీల్లోని తీర్పును చదివి వినిపించారు. దోషులకు ఉరిశిక్ష అని చెప్పగానే అక్కడే ఉన్న కఠారి దంపతుల కుమార్తె కఠారి లావణ్య భావోద్వేగంతో కన్నీళ్లు తుడుచుకుంటూనే పూర్తి తీర్పును విన్నారు. ఆపై కఠారి కోడలు హేమలత, లావణ్య మీడియాతో మాట్లాడారు. పదేళ్ల నిరీక్షణ తర్వాత దోషులకు మరణశిక్ష పడటం న్యాయవ్యవస్థపై నమ్మకం పెంచిందన్నారు. కఠారి సమాధుల వద్ద నివాళులరి్పంచి, కార్పొరేషన్ కార్యాలయంలోని వాళ్ల విగ్రహానికి పూలమాలలు వేశారు. ఇక పబ్లిక్ ప్రాసిక్యూటర్ జీఎస్.శైలజా మాట్లాడుతూ దోషులు చేసిన నేరానికి తగిన శిక్ష పడిందన్నారు. తీర్పుపై హైకోర్టుకు వెళతామని, కఠారి కేసులో మరణశిక్ష విధించే గ్రావిటీ లేదని.. హైకోర్టు కేసును కొట్టేస్తుందనే విశ్వాసం తమకు ఉందని డిఫెన్స్ న్యాయవాది విజయచందర్‌రెడ్డి అన్నారు.

తీర్పు ఇలా..
న్యాయమూర్తి తన ఐదు పేజీల తీర్పులో 13 అంశాలను ప్రస్తావించారు. ఇందులో ప్రధానంగా
ఐపీసీ 302, రెడ్‌విత్ 120–బి కింద కఠారి అనురాధను హత్య చేసినందుకు ఐదుగురు దోషుల గొంతుకు ఉరి బిగించి మరణించేంత వరకు ఉరి తీయాలి. బాధిత కుటుంబాలకు ప్రధాన నిందితుడు రూ.70 లక్షల జరిమానా చెల్లించాలి. లేకుంటే ఆర్నెళ్ల జైలుశిక్ష, ఏ2 నుంచి ఏ5 దోషులకు వెయ్యి జరిమానా, చెల్లించని పక్షంలో ఆర్నెళ్ల జైలుశిక్ష.
ఐపీసీ 302, రెడ్‌విత్ 120–బి కింద కఠారి మోహన్‌ను హత్య చేసినందుకు ఐదుగురు దోషుల గొంతుకు ఉరి బిగించి మరణించేంత వరకు ఉరి తీయాలి. ఒక్కొక్కరూ రూ.వెయ్యి జరిమానా, లేకుంటే ఆర్నెళ్ల జైలుశిక్ష.
కఠారి అనుచరుడు వేలూరు సతీష్‌కుమార్ నాయుడపై హత్యాయత్నం చేయడానికి ప్రయతి్నంచినందుకు మంజునాథ్‌తో సహా ఐదుగురికి ఐపీసీ 307 ప్రకారం జీవిత ఖైదు. ఒక్కొక్కరికీ రూ.500 జరిమానా.
సెక్షన్ 428 (1) సీఆర్‌సీపీ ప్రకారం.. దోషులు ఐదుగురు జైల్లో గడిపిన కాలాన్ని శిక్ష నుంచి మినహాయించారు.
దోషులకు ఉరిశిక్ష విధించినప్పటికీ హైకోర్టు తీర్పును నిర్ధారించేంత వరకు ఉరిని అమలు చేయకూడదు.
దోషులు ఉరిశిక్షపై అమరావతిలోని రాష్ట్ర హైకోర్టులో అప్పీలు చేసుకునే అవకాశం కల్పించారు.
తప్పుడు సాక్ష్యంపై..
ఇక ఈ కేసులో 14 మంది ప్రభుత్వ ఉద్యోగుల తీరును కోర్టు తప్పుబట్టింది. న్యాయమూర్తి ఇచ్చిన బైదు పేజీల తీర్పులో సాక్షులుగా ఉన్న సురేష్ కుమార్, మల్లికార్జున, బాలకృష్ణ, పద్మనాభశెట్టి, ఆదాము, ఆనందనాయుడు, మునిరత్నం, ముద్దకృష్ణ యాదవ్, దొరైరాజ్, త్యాగరాజన్, కిరణ్‌కుమార్, వాసుబాబు, గోపీనాథ్, ధనంజయ అనే వ్యక్తులు ఈ సులో సాకు‡్ష్యలుగా ఉంటూ.. కోర్టులో తప్పుడు సాక్ష్యం ఇవ్వడానికి ప్రయత్నించారని తీర్పులో పేర్కొన్నారు. సెక్షన్ 193 ఐపీసీ (నేరం రుజువైతే ఏడేళ్ల గరిష్ట జైలుశిక్ష) ప్రకారం ఎందుకు వీళ్లను ప్రాసిక్యూట్ చేయకూడదో షోకాజు నోటీసులు పంపాలని ఏపీపీ ద్వారా వివరణ ఇవ్వాలని, వీళ్ల చిరునామాలు పది రోజుల్లో సేకరించాలని వన్‌టౌన్ పోలీసులను ఆదేశించింది.
దోషుల నేపథ్యం
ఈ కేసులో ప్రధాన దోషి చింటూ మెరైన్ ఇంజినీరింగ్‌లో డిప్లొమోచేసి, బాంబేలోని ఐఎన్‌ఏ (ఇండియన్ నావెల్ షిప్)లో పనిచేస్తూ.. తన మామ కఠారి మోహన్‌పై జరిగిన దాడికి ప్రతీకారంగా మాజీ ఎమ్మెల్యే సీకే బాబును ఎదిరించి ఆయనపై హత్యాయత్నం చేసి రెండేళ్ల పాటు జైల్లో ఉన్నాడు. ఈ కేసులో చిత్తూరు కోర్టు చింటూకు జీవితఖైదు విధించినప్పటికీ, హైకోర్టు ఆ కేసును కొట్టేసింది. కఠారి మోహన్ కోసం సీకేను ఎదిరించిన చింటూ, ఆపై సొంత మామనే మట్టుబెట్టి తొమ్మిదిన్నరేళ్ల వరకు జైల్లో ఉన్నాడు.
కర్ణాటక రాష్ట్రం ముల్‌బాగిల్‌కు చెందిన వెంకటాచలపతి ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తూ మోహన్‌కు పరిచయమై ఉద్యోగం పోగొట్టుకున్నాడు. ఆపై చింటూకు దగ్గరయ్యాడు.
తండ్రి ఆటో నడిపితేగానీ ఇల్లు గడవని జయప్రకాష్‌రెడ్డి కూడా చిత్తూరులోని గంగనపల్లె ఉంటూ మోహన్, చింటూ వద్ద తిరుగుతూ 23 ఏళ్ల వయస్సులో జంట హత్యల కేసులో చిక్కుకుని దాదాపు పదేళ్ల పాటు జైల్లో ఉంటూ ఇపుడు దోషిగా తేలాడుడు.
గంగవరం మండలం మారేడుపల్లెకు చెందిన మంజునాథ్ తాపీ కూలి పనిచేస్తూ చింటూ ఇంటి వద్ద గోడ కట్టడానికి వచ్చి అతని వద్దే ఉండిపోయాడు. ఇతను కూడా జంట హత్యలు జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు జైల్లోనే ఉన్నాడు.
గంగనపల్లెకు చెందిన మరో దోషి వెంకటే‹Ù. మోహన్ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తూ ఆపై చింటూ వద్ద సైతం డ్రైవర్‌గా పనిచేసి జంట హత్యల్లో దోషిగా తేలాడు.
పదేళ్ల పరిణామాలు ఇలా..
2015, నవంబర్ 17 – మధ్యాహ్నం 12 గంటల సమయంలో చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నాటి మేయర్ అనురాధను తుపాకీతో కాల్చి చంపారు. ఆమె భర్త కఠారి మోహన్‌ను కత్తులతో వెంటాడి నరికేశారు. అదే రోజు రాత్రి వేలూరులోని ఓ ఆస్పత్రిలో మోహన్ మృతిచెందాడు. అడ్డొచ్చిన వేలూ రు సతీ‹Ùకుమార్ నాయుడుపై హత్యాయత్నం చేశారు.
2016 ఫిబ్రవరి 19 – ఈ కుట్రలో 23 మందికి సంబంధం ఉన్నట్లు న్యాయ స్థానంలో నేరాభియో గపత్రం దాఖలు చేసిన పోలీసులు
2016 ఏప్రిల్ – కఠారి దంపతుల హత్య కేసు విచారణ ప్రారంభం
2025 ఫిబ్రవరి 7 – షరతులతో కూడిన బెయిల్‌పై చింటూ విడుదల
2025 అక్టోబర్ 16 – విచారణ పూర్తి, తీర్పు వెలువరించే తేదీపై ప్రకటన
2025 అక్టోబర్ 24 – చంద్రశేఖర్ (చింటూ), వెంకటాచలపతి, జయప్రకాష్ రెడ్డి, మంజునాథ్, వెంకటేష్ అనే ఐదుగురిపై నేరం రుజువైనట్లు కోర్టు తీర్పు. మిగిలిన 16 మందిపై నేరం రుజువుకాకపోవడంతో వాళ్లపై కేసు కొట్టేసిన న్యాయస్థానం. శిక్ష ఖారుపై తీర్పు వాయిదా.
2025 అక్టోబర్ 27 – దోషుల మానసిక పరిస్థితి, జైల్లో ప్రవర్తనపై నివేదిక కోరిన న్యాయస్థానం.
2024 అక్టోబర్ 30 – నివేదిక తీసుకున్న అనంతరం ప్రాసిక్యూషన్ డిఫెన్స్ వాదనలు పూర్తి. మరుసటి రోజుకు తీర్పు రిజర్వు.
2024 అక్టోబర్ 31 – ఐదుగురు దోషులకు మరణ శిక్ష. కడప జైలుకు తరలింపు



