Oyo IPO: జోస్టల్‌ మోకాలు అడ్డు.. సెబీ పరిశీలన తప్పదా?

Zostel asks Sebi to reject and suspend Oyo IPO plan - Sakshi

Oyo Initial Public Offering: పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీవో) ద్వారా సమీకరణకు సిద్ధమైన ఓయోకి భారీ ఝలక్‌ తగిలింది.  ప్రత్యర్థి కంపెనీ జోస్టల్‌.. ఓయో ఐపీవో ప్రతిపాదనను తిరస్కరించాలంటూ క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ఓ లేఖ రాసింది. డ్రాఫ్ట్‌ రెడ్‌ హెర్రింగ్‌ ప్రాస్‌పెక్టస్‌(DRHP) నిబంధనలకు విరుద్ధంగా ఉందని, దానిని పక్కనపెట్టడంతో పాటు ఓయో ఐపీవో ప్రతిపాదనను తిరస్కరించాలని  సెబీకి జోస్టల్‌ విజ్ఞప్తి చేసింది. 

ఆతిథ్య సేవల సంస్థ ఓయో ఇన్షియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (Initial public offering) ద్వారా 1.2 బిలియన్‌ డాలర్ల( రూ.8,430 కోట్లు) సమీకరణకు సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే ఓయో మాతృ సంస్థ ఓరావెల్‌ స్టేస్‌..  క్యాపిటల్‌ స్ట్రక్చర్‌ తుది రూపానికి రాని తరుణంలో ఐపీవోకి వెళ్లడం ఎలా కుదురుతుందని అభ్యంతరం వ్యక్తం చేస్తోంది ​జోస్టల్‌. ఈ మేరకు ఐపీవోకు అనుమతించకూడదంటూ సెబీకి విజ్ఞప్తి చేసింది. సెబీ గనుక ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటే మాత్రం ఓయోకి చిక్కులు తప్పవని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ ఏడాది జులైలో ఫుడ్‌ యాప్‌ జొమాటో ఐపీవో విజయవంతమైన తర్వాత పబ్లిక్‌ ఇష్యూకు వచ్చేందుకు ఓయో సిద్ధమైంది. ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ నుంచి పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీగా మార్చేందుకు ఓయో మాతృ సంస్థ ఓరావెల్‌ స్టేస్‌ వాటాదార్లు ఇటీవలె ఆమోదం తెలిపారు. దీంతో తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) ద్వారా రూ.8,430 కోట్లు సమీకరించడానికి సిద్ధమైంది. ఈ మేరకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద కంపెనీ ఈ నెల మొదట్లో ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది.

ఇదిలా ఉంటే ఆతిథ్య సేవల రంగంలో జోస్టల్‌-ఓరావెల్‌ స్టేస్‌లు ప్రత్యర్థులుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.  ఈ ఏడాది మొదట్లో జోస్టల్‌కు అనుకూలంగా సుప్రీంకోర్టు నియమించిన మధ్యవర్తి తీర్పును సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌తో పాటు ఓయోకి వ్యతిరేకంగా దాఖలు చేసిన మరో పిటిషన్‌పైనా సంయుక్తంగా ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం అక్టోబర్‌ 21న విచారణ చేపట్టాల్సి ఉంది.

ఓయో ఐపీవో ముఖచిత్రం
ప్రతిపాదిత ఇష్యూలో రూ.7,000 కోట్ల విలువైన తాజా షేర్లతో పాటు ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో రూ.1,430 కోట్ల విలువైన షేర్లను కంపెనీ విక్రయించనుంది. 
ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో ఎస్‌వీఎఎఫ్‌ ఇండియా హోల్డింగ్స్‌ లిమిటెడ్‌, ఏ1 హోల్డింగ్స్‌, చైనా లాడ్జింగ్‌ హోల్డింగ్స్‌, గ్లోబల్‌ ఐవీవై వెంచర్స్‌ ఎల్‌ఎల్‌పీ షేర్లను  విక్రయించనున్నాయి. 
ప్రస్తుతం ఓయోలో ఎస్‌వీఎఎఫ్‌ 46.62%, ఆర్‌ఏ హాస్పిటాలిటీ హోల్డింగ్స్‌కు 24.94%, రితేశ్‌ అగర్వాల్‌కు 8.21% వాటాలు ఉన్నాయి. 
ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను రుణాల చెల్లింపునకు, వాణిజ్య విస్తరణకు కంపెనీ వినియోగించనుంది.  
ఈ పబ్లిక్‌ ఇష్యూ నిర్వహించేందుకు జేపీ మోర్గాన్, సిటీ, కోటక్‌ మహీంద్రా క్యాపిటల్‌ వంటి ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌లను ఓయో నియమించుకుంది.

చదవండి: క్యూ3లో ఐపీవో స్పీడ్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top