పెద్ద చిక్కుల్లో పడిన షావోమి ఇండియా..! | Xiaomi India Evaded Customs Duty of Rs 653 crore: DRI | Sakshi
Sakshi News home page

పెద్ద చిక్కుల్లో పడిన షావోమి ఇండియా..!

Jan 5 2022 9:00 PM | Updated on Jan 5 2022 9:43 PM

Xiaomi India Evaded Customs Duty of Rs 653 crore: DRI - Sakshi

ప్రముఖ చైనా మొబైల్ తయారీ సంస్థ షావోమి టెక్నాల‌జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పెద్ద చిక్కుల్లో పడింది. షావోమి ఇండియా క‌స్ట‌మ్స్ సుంకాన్ని ఎగ‌వేస్తోందని వచ్చిన స‌మాచారం ఆధారంగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) షావోమి, దాని కాంట్రాక్టు ఉత్ప‌త్తిదారుల‌పై ద‌ర్యాప్తును ప్రారంభించింది. ఈ ద‌ర్యాప్తు సంద‌ర్భంగా డీఆర్ఐ దేశవ్యాప్తంగా ఉన్న షావోమి ఇండియా కార్యాలయాల్లో సోదాల‌ను నిర్వ‌హించింది. ఈ సోదాల్లో భాగంగా ఒప్పంద నిబంధన ప్రకారం క్వాల్‌కామ్‌ యూఎస్‌ఏ, బీజింగ్‌ షావోమి మొబైల్స్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ లిమిటెడ్‌కు షావోమి ఇండియా రాయల్టీ, లైసెన్స్‌ ఫీజుల రూపంలో డబ్బులు చెల్లిస్తున్నట్టు గుర్తించింది.

భారత్‌లో ఎంఐ బ్రాండ్‌తో షావోమి ఇండియా మొబైల్స్‌ను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఫోన్లలో కొన్నింటిని విదేశాల నుంచి షావోమి ఇండియా దిగుమతి చేసుకుంటుంది. లేదంటే విడి పరికాలను ఒప్పంద తయారీదారుల నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడే అసెంబుల్డ్‌ చేస్తుంది. దేశంలోని స్మార్ట్‌ఫోన్‌ విపణిలో షావోమికి గణనీయమైన వాటానే ఉంది. విలువను తగ్గించి షావోమి ఇండియా కస్టమ్స్‌ సుంకం ఎగవేతకు పాల్పడినట్టు గుర్తించామని డీఆర్‌ఐ తెలిపింది. సంబంధిత కంపెనీ, ఒప్పంద తయారీ సంస్థల్లో పరిశోధన చేపట్టామని పేర్కొంది. 

'షావోమి ఇండియా, సంబంధిత తయారీ కంపెనీల్లోని కీలక ఉద్యోగుల స్టేట్‌మెంట్లను రికార్డు చేశాం. షావోమి కంపెనీ డైరెక్టర్‌ ఒకరు రాయల్టీ చెల్లించినట్టు ధ్రువీకరించారు' అని డీఆర్‌ఐ ప్రకటించింది. రాయల్టీ, లైసెన్స్‌ ఫీజు చెల్లించడమే కాకుండా ఒప్పంద తయారీదారుల నుంచి దిగుమతి చేసుకున్న ఉత్పత్తి లావాదేవీల విలువను జోడించలేదని వెల్లడించింది. దీంతో షావోమి ఇండియా కస్టమ్స్‌ సుంకం ఎగవేసినట్టు గుర్తించామని పేర్కొంది. ఇలా చేయడం క‌స్ట‌మ్స్ చ‌ట్టం-1962 క‌స్ట‌మ్స్ వాల్యుయేష‌న్ నిబంధ‌న‌లను, 2007లోని సెక్ష‌న్ 14ను ఉల్లంఘించ‌డ‌మే అని తెలిపింది. 'డీఆర్‌ఐ దర్యాప్తు పూర్తి చేసిన తర్వాత 1962, కస్టమ్స్‌ చట్టం ప్రకారం.. షావోమి టెక్నాలజీస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుంచి 01-4-2017 నుంచి 30-06-2020 కాలానికి రూ.653 కోట్లు రికవరీకి డిమాండ్‌ చేస్తూ 3 షోకాజ్‌ నోటీసులు జారీ చేశాం' అని డీఆర్‌ఐ తెలిపింది.

(చదవండి: ఆకర్షణీయమైన లుక్స్‌తో సరికొత్తగా రానున్న మారుతి సుజుకీ బాలెనో..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement