52 వేలమంది ఉద్యోగులున్న కంపెనీ.. లేఆఫ్స్‌కు రెడీ! | Qualcomm Layoffs Global Job Cuts Coming in November | Sakshi
Sakshi News home page

52 వేలమంది ఉద్యోగులున్న కంపెనీ.. లేఆఫ్స్‌కు రెడీ!

Oct 21 2026 1:43 PM | Updated on Oct 21 2026 2:18 PM

Qualcomm Layoffs Global Job Cuts Coming in November

టెక్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ప్రముఖ చిప్ తయారీ సంస్థ క్వాల్‌కామ్ (Qualcomm) కూడా కొంతమంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్లను నవంబర్ నెలలో ఉద్యోగులకు పంపనున్నట్లు తెలుస్తోంది.

ఉద్యోగుల తొలగింపుకు కారణం
ఉద్యోగుల పనితీరును సమీక్షించిన తర్వాత లేఆఫ్స్ నిర్ణయం తీసుకున్నట్లు సీఈఓ క్రిస్టియానో అమోన్  వెల్లడించారు. సంస్థలో మెరుగైన పనితీరు సంస్కృతిని తీసుకురావడమే ఈ నిర్ణయం వెనుక ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. కంపెనీలో ఆశించిన స్థాయిలో నిరంతరం పనితీరు కనబరచలేని పరిస్థితులను పరిష్కరించాల్సిన అవసరం ఉందని వివరించారు. అయితే.. కంపెనీ ఎంతమందిని తొలగించనుందనే విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు. వ్యాపార అవసరాలు, సంస్థ భవిష్యత్తు ప్రణాళికలు, ఉద్యోగుల నైపుణ్యాలు, అనుభవాన్ని బట్టి ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

కంపెనీ వ్యాపారం విస్తరిస్తున్న కొద్దీ.. తమకు అవసరమైన నైపుణ్యాలు కూడా మారుతున్నాయని అమోన్ పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో.. సరైన వ్యక్తులకు సరైన బాధ్యతలు అప్పగించడం ద్వారా ఉద్యోగులు మెరుగ్గా పనిచేయడంతో పాటు సంస్థ కూడా అభివృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

కంపెనీలో 52వేలమంది!
గత ఏడాది సెప్టెంబర్ నాటికి క్వాల్‌కామ్‌లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 52,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు సమాచారం. అయితే, తాజా తొలగింపుల్లో ఎంతమందికి ఉద్వాసన పలుకుతారనే దానిపై ఇంకా స్పష్టత లేదు.

ప్రపంచంలోని అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ చిప్ తయారీ సంస్థల్లో క్వాల్‌కామ్ ఒకటి. అయితే.. ఈ ఏడాది వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ అమ్మకాలు మందగించడం కంపెనీకి సవాలుగా మారింది. ముఖ్యంగా మెమరీ చిప్స్ ధరలు పెరగడంతో కీలక మార్కెట్లలో డిమాండ్‌పై ప్రభావం పడినట్లు నివేదిక పేర్కొంది.

చిప్స్‌కు డిమాండ్‌
మెమరీ చిప్స్ ధరలు పెరిగితే స్మార్ట్‌ఫోన్ల తయారీ ఖర్చు కూడా పెరుగుతుంది. దీంతో ఫోన్ల ధరలు పెరగడం లేదా వినియోగదారులు కొత్త ఫోన్ల కొనుగోళ్లను వాయిదా వేయడం వంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. ఇలాంటి పరిణామాలు స్మార్ట్‌ఫోన్ చిప్స్‌కు డిమాండ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. 2026లో ఇప్పటివరకు క్వాల్‌కామ్ షేర్లు సుమారు 1.5 శాతం మాత్రమే పెరిగాయి. ఇదే సమయంలో అమెరికా ఎస్‌అండ్‌పీ 500 సూచీ 12 శాతానికి పైగా, ఫిలడెల్ఫియా సెమీకండక్టర్ ఇండెక్స్ దాదాపు 60 శాతం పెరిగినట్లు రాయిటర్స్ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement