విప్రో లాభం జూమ్‌

Wipro delivers its best-ever quarter in Q1 - Sakshi

జూన్‌ త్రైమాసికంలో 36 శాతం పెరుగుదల

2021–22పై కంపెనీ సానుకూల అంచనాలు

రెండంకెల వృద్ధి సాధిస్తామని ప్రకటన

ఆదాయం సైతం 22 శాతం పెరుగుదల

న్యూఢిల్లీ: ఐటీ రంగ కంపెనీ విప్రో జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో (ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021–22) చక్కని పనితీరును నమోదు చేసింది. కన్సాలిడేటెడ్‌ లాభం (అనుబంధ సంస్థలతో కలసి) క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 35.6 శాతం వృద్ధితో రూ.3,243 కోట్లకు దూసుకుపోయింది. అంతక్రితం ఏడాది జూన్‌ త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.2,390 కోట్లుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండంకెల ఆదాయ వృద్ధిని సాధించగలమన్న సానుకూల అంచనాలను కంపెనీ యాజమాన్యం వ్యక్తం చేసింది. ఆదాయం 22.3 శాతం పెరిగి రూ.18,252 కోట్లుగా నమోదైంది.

‘‘వేగవంతమైన వృద్ధి క్రమంలో ఉన్నాం. మా సరఫరా చైన్‌ స్థాయిని పెంచాం. అలాగే, నిపుణుల నియామకంలోనూ ప్రగతి ఉంది. ఇదే మంచి పనితీరుకు దోహదం చేసింది. వచ్చే మూడు త్రైమాసికాలకు సంబంధించి బలమైన పనితీరు నమోదు చేసేందుకు వీలుగా ఆర్డర్లు అందుకున్నాం. క్యూ1, క్యూ2 అంచనాలను గమనిస్తే.. పూర్తి ఆర్థిక సంవత్సరానికి రెండంకెల వృద్ధిని సాధించగలమన్నది స్పష్టమవుతుంది. క్యాప్కోను మినహాయించి చూసినా ఈ మేరకు వృద్ధి సాధిస్తాం’’ అని విప్రో సీఈవో, ఎండీ థీరీ డెలపోర్టే తెలిపారు. లండన్‌ కేంద్రంగా పనిచేస్తున్న క్యాప్కో కంపెనీని విప్రో 1.45 బిలియన్‌ డాలర్లకు (రూ.10,500 కోట్లు) ఈ ఏడాది మార్చిలో కొనుగోలు చేసిన విషయం గమనార్హం. విప్రో చరిత్రలోనే ఇది అతిపెద్ద కొనుగోలు.  

క్యూ2లో 5–7 శాతం వృద్ధి
జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికంలో 5.7% ఆదాయంలో వృద్ధిని నమోదు చేయగలమన్న అంచనాలను విప్రో తాజాగా వ్యక్తం చేసింది. డాలర్‌ మారకంలో 2,535–2,583 మిలియన్‌ డాలర్ల మధ్య ఆదాయం ఉండొచ్చని ప్రకటించింది. ఇందులో దిగువ స్థాయి అంచనాల మేరకు ఆదాయం నమోదైనా.. వార్షిక ఆదాయం 10 బిలియన్‌ డాలర్లను అధిగమిస్తామని డెలపోర్టే పేర్కొన్నారు. ప్రధానమైన ఐటీ సేవల విభాగంలో ఆదాయం 2020–21 మార్చి త్రైమాసికంతో పోలిస్తే.. 2021–22 జూన్‌ క్వార్టర్‌లో 12.2% పెరిగి 2,414 మిలియన్‌ డాలర్లకు చేరుకుంది. వార్షికంగా చూస్తే 25.7 శాతం పెరిగింది. 2.4 శాతం వృద్ధి ఉండొచ్చన్న గత అంచనాలతో పోలిస్తే మెరుగైన పనితీరే నమోదైంది. ‘‘మా నూతన వ్యాపార విధానం నిర్వహణ నమూనాను సులభతరం చేస్తుంది. దీనికి సంబంధించి చక్కని ఫలితాలు కనిపించనున్నాయి. అత్యుత్తమ త్రైమాసిక ఫలితాలు మాత్రమే కాదు.. 38 క్వార్టర్లలో అత్యధిక సీక్వెన్షియల్‌ (త్రైమాసికవారీగా) వృద్ధి ఇది. అన్ని మార్కెట్లలోనూ బలమైన విక్రయాలు అద్భుతమైన వృద్ధికి దారితీశాయి. డిమాండ్‌ ఎంతో బలంగా ఉంది’’అని డెలపోర్టే కంపెనీ పనితీరును వివరించారు.

మార్కెట్‌ ముగిసిన తర్వాత విప్రో ఫలితాలు వెలువడ్డాయి. బీఎస్‌ఈలో షేరు రెండున్నర శాతం లాభంతో రూ.576 వద్ద ముగిసింది.

నియామకాలు పెంచుతున్నాం..
అధిక అట్రిషన్‌ రేటు (ఉద్యోగుల వలస) సర్వ సాధారణమేనని డెలపోర్టే తెలిపారు. ‘‘క్యాంపస్‌ల నుంచి నియామకాలను రెట్టింపు చేశాం. 2021–22లో 33 శాతం ఫ్రెషర్లను (కొత్తవారిని) అదనంగా తీసుకోనున్నాం. క్యూ2లో (జూలై–సెప్టెంబర్‌లో) 6,000 మందికి పైగా ఫ్రెషర్లను తీసుకుంటాం’’ అని డెలపోర్టే వివరించారు. 80 శాతం ఉద్యోగులకు వేతనాల పెంపును ప్రకటించగా ఇది సెప్టెంబర్‌ 1 నుంచి అమల్లోకి రానుందని.. ఇది ప్రస్తుత సంవత్సరంలో రెండో పెంపుగా చెప్పారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top