కొనుగోళ్లపై టాటా కన్జూమర్‌ కన్ను

Will continue to look for acquisition opportunities Says Tata Chairmen N Chandrasekaran  - Sakshi

విభిన్న కంపెనీలకు ప్రాధాన్యం

చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ వెల్లడి

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం టాటా కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌ ఇతర కంపెనీల కొనుగోళ్లపై కన్నేసింది. విభిన్న కేటగిరీలలో సరైన అవకాశాలను అందిపుచ్చుకునే యోచనలో ఉన్నట్లు కంపెనీ చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ పేర్కొన్నారు. వివిధ విభాగాలలో అనువైన కంపెనీలను కొనుగోలు చేయడం ద్వారా వృద్ధికి ఊతమివ్వాలని చూస్తున్నట్లు తెలియజేశారు. కంపెనీ వార్షిక సమావేశంలో భాగంగా వాటాదారుల ప్రశ్నలకు స్పందిస్తూ టాటా సన్స్‌ చైర్మన్‌ చంద్రశేఖరన్‌ ప్రొడక్ట్‌ పోర్ట్‌ఫోలియోను పెంచుకోవడం, పంపిణీని విస్తరించడం, నూతన ఆవిష్కరణలు, కొత్త విభాగాలలోకి ప్రవేశించడం వంటి పలు ప్రణాళికలను వెల్లడించారు. భవిష్యత్‌ వృద్ధికి మద్దతుగా ఇతర కంపెనీల కొనుగోళ్లతోపాటు.. సొంత కార్యకలాపాల విస్తరణను సైతం చేపట్టనున్నట్లు తెలియజేశారు. ఈ ఆర్థిక సంవత్సరం(2022–23)లో రూ. 361 కోట్ల పెట్టుబడులను వెచ్చించనున్నట్లు వెల్లడించారు. వెలుపలి అవకాశాల ద్వారా విస్తరించడం కంపెనీ కీలక వ్యూహాలలో భాగమని ప్రస్తావించారు.  
గతేడాది కొనుగోళ్లు
గతేడాది గ్రూప్‌ సంస్థ టాటా స్మార్ట్‌ఫుడ్‌(టీఎస్‌ఎఫ్‌ఎల్‌)ను రూ. 395 కోట్లకు టాటా కన్జూమర్‌ సొంతం చేసుకుంది. అంతేకాకుండా చిరు ధాన్యాలు, తృణ ధాన్యాలతో ఆరోగ్యకర అల్పాహారం, స్నాక్స్‌ తయారు చేసే కొట్టారం ఆగ్రో ఫుడ్స్‌ను టాటా కన్జూమర్‌ చేజిక్కించుకుంది. కాగా.. ఇటీవల భౌగోళిక, రాజకీయ ఆందోళనలు, సరఫరా సవాళ్లు, చమురుసహా పలు కమోడిటీల ధరలతో ద్రవ్యోల్బణం అదుపు తప్పినట్లు చంద్రశేఖరన్‌ పేర్కొన్నారు. ఇలాంటి అనిశ్చితుల్లో తాము పటిష్ట కార్యాచరణ చేపట్టినట్లు తెలియజేశారు. తద్వారా ఈ కాలంలో పుట్టుకొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకునే ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు వివరించారు. గతేడాది నౌరిష్‌కో, టాటా సంపన్న్, టాటా సోల్‌ఫుల్, టాటా క్యూ బ్రాండ్లు 52 శాతం పురోభివృద్ధిని సాధించినట్లు వెల్లడించారు. టాటా స్టార్‌బక్స్‌ భాగస్వామ్య సంస్థ కరోనా మహమ్మారి సవాళ్లలోనూ 50 కొత్త స్టోర్లను ప్రారంభించినట్లు తెలియజేశారు. దీంతో 26 పట్టణాలలో 268కు స్టోర్స్‌ సంఖ్య చేరినట్లు వెల్లడించారు.
టాటా కన్జూమర్‌ షేరు నామమాత్ర లాభంతో రూ. 730 వద్ద ముగిసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top