breaking news
Companies Purchases
-
కొనుగోళ్లపై టాటా కన్జూమర్ కన్ను
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ ఇతర కంపెనీల కొనుగోళ్లపై కన్నేసింది. విభిన్న కేటగిరీలలో సరైన అవకాశాలను అందిపుచ్చుకునే యోచనలో ఉన్నట్లు కంపెనీ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ పేర్కొన్నారు. వివిధ విభాగాలలో అనువైన కంపెనీలను కొనుగోలు చేయడం ద్వారా వృద్ధికి ఊతమివ్వాలని చూస్తున్నట్లు తెలియజేశారు. కంపెనీ వార్షిక సమావేశంలో భాగంగా వాటాదారుల ప్రశ్నలకు స్పందిస్తూ టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోను పెంచుకోవడం, పంపిణీని విస్తరించడం, నూతన ఆవిష్కరణలు, కొత్త విభాగాలలోకి ప్రవేశించడం వంటి పలు ప్రణాళికలను వెల్లడించారు. భవిష్యత్ వృద్ధికి మద్దతుగా ఇతర కంపెనీల కొనుగోళ్లతోపాటు.. సొంత కార్యకలాపాల విస్తరణను సైతం చేపట్టనున్నట్లు తెలియజేశారు. ఈ ఆర్థిక సంవత్సరం(2022–23)లో రూ. 361 కోట్ల పెట్టుబడులను వెచ్చించనున్నట్లు వెల్లడించారు. వెలుపలి అవకాశాల ద్వారా విస్తరించడం కంపెనీ కీలక వ్యూహాలలో భాగమని ప్రస్తావించారు. గతేడాది కొనుగోళ్లు గతేడాది గ్రూప్ సంస్థ టాటా స్మార్ట్‌ఫుడ్(టీఎస్‌ఎఫ్‌ఎల్)ను రూ. 395 కోట్లకు టాటా కన్జూమర్ సొంతం చేసుకుంది. అంతేకాకుండా చిరు ధాన్యాలు, తృణ ధాన్యాలతో ఆరోగ్యకర అల్పాహారం, స్నాక్స్ తయారు చేసే కొట్టారం ఆగ్రో ఫుడ్స్‌ను టాటా కన్జూమర్ చేజిక్కించుకుంది. కాగా.. ఇటీవల భౌగోళిక, రాజకీయ ఆందోళనలు, సరఫరా సవాళ్లు, చమురుసహా పలు కమోడిటీల ధరలతో ద్రవ్యోల్బణం అదుపు తప్పినట్లు చంద్రశేఖరన్ పేర్కొన్నారు. ఇలాంటి అనిశ్చితుల్లో తాము పటిష్ట కార్యాచరణ చేపట్టినట్లు తెలియజేశారు. తద్వారా ఈ కాలంలో పుట్టుకొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకునే ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు వివరించారు. గతేడాది నౌరిష్కో, టాటా సంపన్న్, టాటా సోల్‌ఫుల్, టాటా క్యూ బ్రాండ్లు 52 శాతం పురోభివృద్ధిని సాధించినట్లు వెల్లడించారు. టాటా స్టార్‌బక్స్ భాగస్వామ్య సంస్థ కరోనా మహమ్మారి సవాళ్లలోనూ 50 కొత్త స్టోర్లను ప్రారంభించినట్లు తెలియజేశారు. దీంతో 26 పట్టణాలలో 268కు స్టోర్స్ సంఖ్య చేరినట్లు వెల్లడించారు. టాటా కన్జూమర్ షేరు నామమాత్ర లాభంతో రూ. 730 వద్ద ముగిసింది. -
భారత్‌లో ట్వీటర్ టేకోవర్ బోణీ
* బెంగళూరు స్టార్టప్ జిప్‌డయల్ కొనుగోలు * డీల్ విలువ రూ.247 కోట్లుగా అంచనా... * భారత్‌లో వ్యాపారాభివృద్ధిపై మరింత దృష్టి... న్యూఢిల్లీ: సోషల్ నెట్వర్క్ దిగ్గజం ట్వీటర్.. భారత్‌లో తొలిసారిగా కంపెనీల కొనుగోళ్లకు తెరతీసింది. బెంగళూరుకు చెందిన మొబైల్ మార్కెటింగ్ స్టార్టప్ జిప్డయల్ను చేజిక్కించుకుంది. తద్వారా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భారతీయ మార్కెట్లో వ్యాపారాన్ని, ఆదాయాలను పెంచుకోవడానికి బాటలు వేసుకుంటోంది. ఈ కొనుగోలు విలువ ఎంతనేది ఇరు కంపెనీలూ వెల్లడించనప్పటికీ.. 3-4 కోట్ల డాలర్ల(దాదాపు రూ.185-247 కోట్లు) మేరకు ఉంటుందనేది మార్కెట్ వర్గాల అంచనా. ఈ కొనుగోలు ద్వారా భారత్‌లో తమ వ్యాపారం జోరందుకోవడంతోపాటు, వ్యూహాల అమలును వేగవంతం చేసేందుకు దోహదం చేస్తుందని ట్వీటర్ ఎండీ(ఇండియా, ఆగ్నేయాసియా) రిషి జైట్లీ చెప్పారు. జిప్‌డయల్ సంగతిదీ... వెలెరీ వేగనర్, అమియా పాథక్, సంజయ్ స్వామి... ఈ ముగ్గురూ 2010లో బెంగళూరు కేంద్రంగా దీన్ని ప్రారంభించారు. మొబైల్స్ ద్వారా ఆఫ్‌లైన్, ఆన్లైన్ మధ్య యూజర్లకు వారధిగా పనిచేసేందుకు రూపొందించిన వినూత్న ప్లాట్‌ఫామ్ ఇది. ఎస్ఎంఎస్, వాయిస్, మొబైల్ వెబ్ వంటివాటినన్నింటినీ సమ్మిళితం చేస్తూ తగిన కంటెంట్‌ను మొబైల్ యూజర్లు దీనిద్వారా పొందొచ్చు. యూజర్లు ఏదైనా ఒక బ్రాండ్‌కు సంబంధించిన నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు కంటెంట్‌ను అందుకునే వీలుంటుంది. ఎస్ఎంఎస్, వాయిస్ కాల్ లేదా యాప్ నోటిఫికేషన్ రూపంలో రియల్‌టైమ్‌లో సమాచారం పొందొచ్చు. పీఅండ్‌జీ, క్యాడ్బరీ, యూనిలీవర్, కోల్గేట్, కేఎఫ్‌సీ, మేక్మైట్రిప్ ఇలా వందలాది బ్రాండ్లను క్లయింట్లుగా కొనసాగిస్తున్న జిప్‌డయల్... ప్రస్తుతం దాదాపు 6 కోట్ల మంది యూజర్లతో అనుసంధానమైంది. ఈ సంస్థ ఉద్యోగుల సంఖ్య 50 మంది మాత్రమే. మంచి లాభాలొచ్చాయి...: స్వామి ఈ డీల్ ద్వారా భారతీయ స్టార్టప్స్‌కు శాన్ఫ్రాన్సిస్కో, సిలికాన్ వ్యాలీల్లో ప్రత్యేక గుర్తింపు లభించినట్లయిందని జిప్‌డయల్ సహ వ్యవస్థాపకుడు సంజయ్ స్వామి పేర్కొన్నారు. రీసెర్చ్ సంస్థ ఈ-మార్కెటెర్ అంచనాల ప్రకారం గత ఏడాది చివరినాటికి భారత్‌లో ట్వీటర్కు 1.81 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. ప్రపంచంలో ఈ సంస్థకు మూడో అతిపెద్ద మార్కెట్‌గా కూడా భారత్ నిలుస్తోంది. కాగా, యూఎస్‌కు చెందిన ఈ కంపెనీకి ఉన్న మొత్తం 28.4 కోట్ల మందికిపైగా యూజర్లలో 70 శాతం మంది అమెరికా వెలుపలే ఉండటం గమనార్హం.