ఎంఎస్‌ఎంఈల ఆదాయం
100 బీపీఎస్ తగ్గే అవకాశం
సూరత్, వదోదరా క్లస్టర్లపై భారీ ఎఫెక్ట్
క్రిసిల్ రిపోర్ట్‌లో వెల్లడి
న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభంతో దేశీయంగా చిన్న, మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈ) సంస్థల ఆదాయాలు, లాభాలపై గణనీయంగా ప్రభావం పడనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వాటి ఆదాయాలు 100 బేసిస్ పాయింట్ల (బీపీఎస్) వరకు (1 శాతం) తగ్గి 7.5 – 8.5 శాతం శ్రేణికి పరిమితం కానున్నాయి. ఇక ఎబిటా సైతం 50–100 బేసిస్ పాయింట్లు క్షీణించి 5–5.5 శాతానికి నెమ్మదించవచ్చునని క్రిసిల్ ఇంటెలిజెన్స్ తాజాగా ఎంఎస్‌ఎంఈ రిపోర్టులో అంచనా వేసింది.
దీని ప్రకారం మోర్బి, ఫిరోజాబాద్, సూరత్, వదోదరలాంటి క్లస్టర్లపై తీవ్ర ప్రభావం ఉండనుంది. ఏడాదికి రెండుసార్లు వెలువరించే ఈ నివేదికలో 69 రంగాలు, 147 క్లస్టర్లను పరిగణనలోకి తీసుకుంటారు. వీటి ఆదాయం రూ. 75 లక్షల కోట్లుగా ఉంటుంది. ఇది భారతదేశ జీడీపీలో దాదాపు 20–25 శాతం, ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలో మూడింట రెండొంతులు ఉంటుంది.
మూడు కేటగిరీలు..
పశ్చిమాసియా సంక్షోభ ప్రభావానికి గురయ్యే ఎంఎస్‌ఎంఈలను మూడు కేటగిరీలుగా నివేదికలో వర్గీకరించారు. గ్యాస్‌లాంటి ఇంధన సంబంధ ముడిసరుకుపై ఆధారపడినవి, ఇంధన సంబంధ డెరివేటివ్స్‌పై ఆధారపడినవి, వ్యాపారపరంగా అవరోధాల ప్రభావం ఎక్కువగా ఎదుర్కొనేవి వీటిలో ఉన్నాయి. గ్యాస్‌లాంటి ఇంధనాలపై ఆధారపడే యూనిట్లపై అత్యధిక ప్రభావం పడనుంది. మోర్బి క్లస్టర్ ఇందుకు ఉదాహరణ. దేశీయంగా సెరామిక్ టైల్స్ ఉత్పత్తిలో దీని వాటా 80 శాతం పైగా ఉంటుంది.
ఇందులో 80–85 శాతం తయారీ .. గ్యాస్ ఆధారంగానే ఉంటోంది. క్లస్టర్‌లోని సెరామిక్ రంగం ఆదాయంలో దీని వాటా 85 శాతంగా ఉంటుంది. 2026 ఆర్థిక సంవత్సరంలో ఈ క్లస్టర్ ఆదాయ వృద్ధి 9–11 శాతంగా ఉండగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1–3 శాతానికి పడిపోనుంది. ఇక్కడ ప్రధానంగా ఎగుమతుల కోసమే ఉత్పత్తి (80–90 శాతం) జరుగుతుండటం ఇందుకు కారణం. ఇందులో 20–25 శాతం ఉత్పత్తి.. పశ్చిమాసియాకే ఎగుమతి అవుతోంది. మోర్బి క్లస్టర్ సెరామిక్ పరిశ్రమ ఎబిటా మార్జిన్ ఈ ఆర్థిక సంవత్సరం 300–400 బేసిస్ పాయింట్లు క్షీణించి 4–6 శాతానికి పరిమితం కానుంది.
అదే విధంగా ఫిరోజాబాద్‌లోని గ్లాస్ సెక్టార్ ఉత్పత్తి 40 శాతం తగ్గడంతో పరిశ్రమ ఆదాయ వృద్ధి 1–3 శాతానికి పరిమితం కానుంది. పశ్చిమాసియా నుంచి మిథనాల్‌లాంటి వాటిని 90 శాతం మేర దిగుమతి చేసుకునే కెమికల్ రంగానికి ముడిసరుకు వ్యయాలు 1.2–1.4 రెట్లు పెరిగిపోయాయి. ఇందులో కొంత భారాన్ని అవి బదలాయించినప్పటికీ 2027 ఆర్థిక సంవత్సరంలో వదోదరలోని కెమికల్ ఎంఎస్‌ఎంఈల మార్జిన్లు 150–250 బీపీఎస్ మేర తగ్గొచ్చనే అంచనాలు నెలకొన్నాయి.
ఇక రోడ్ల నిర్మాణంలాంటి రంగాలపై డీజిల్ రేట్ల పెరుగుదల ప్రభావం పడే అవకాశం ఉంది. సదరు సంస్థల మొత్తం వ్యయాల్లో ఇంధన వ్యయాల వాటా 8–10 శాతం ఉంటుంది. దీంతో వాటి మార్జిన్లు 50–100 బేసిస్ పాయింట్లు తగ్గి 8–10 శాతానికి పరిమితం కావచ్చు. అలాగే, ప్యాకేజ్డ్ ఫుడ్స్ వ్యాపార సంస్థల ఖర్చులో 10–15 శాతం ప్యాకింగ్ వ్యయాలు ఉంటాయి. ఫలితంగా వాటి మార్జిన్లు కూడా 50–100 బేసిస్ పాయింట్లు తగ్గి 6–6.5 శాతానికి నెమ్మదించనున్నాయి.
కొత్తేమీ కాదు..
పరిశ్రమకు ఇలాంటి పరిస్థితి కొత్తేమీ కాదని నివేదిక పేర్కొంది. కోవిడ్ మహమ్మారి సమయంలో 2020, 2021 ఆర్థిక సంవత్సరాల్లో పెద్ద కంపెనీల ఆదాయాలు 1 శాతం వరకు, ఎంఎస్‌ఎంఈల రెవెన్యూ 3–5 శాతం మేర క్షీణించినట్లు తెలిపింది. అలాగే ఎంఎస్‌ఎంఈల ఎబిటా మార్జిన్లు 2021 ఆర్థిక సంవత్సరంలో 80 బీపీఎస్ క్షీణించి 4.7 శాతానికి తగ్గినట్లు పేర్కొంది. ప్రస్తుతం పశ్చిమాసియా సంక్షోభం తీరుతెన్నులు కూడా అదే తరహాలో ఉన్నట్లు తెలిపింది.
చిన్న వ్యాపారాలపై ప్రభావం ఎక్కువగా ఉండే పరిస్థితి కనిపిస్తోందని నివేదిక వివరించింది. ఎంఎస్‌ఎంఈలు రెండు రకాల సవాళ్లు ఎదుర్కొంటున్నాయని పేర్కొంది. గ్యాస్‌లాంటి ముడి సరుకు లభ్యత తగ్గిపోవడం వల్ల ఉత్పత్తిని తగ్గించుకోవాల్సి వచ్చి, ఆ కారణంగా ఆదాయాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఉంటోందని వివరించింది. ఇక రెండో అంశం విషయానికొస్తే వ్యాపారానికి అవరోధాలు, పెరిగిన కమోడిటీ..ఇంధన వ్యయాలను కస్టమర్లకు బదలాయించేలా, రేట్లను పెంచలేని పరిస్థితి వల్ల మార్జిన్లు కూడా తగ్గిపోయే అవకాశం ఉంటోందని నివేదిక పేర్కొంది.


