కలసికట్టుగా ఆర్థిక వ్యవస్థలను కాపాడుకుందాం!

We Will Protect Our Economy Nirmala Seetharaman In G20summit - Sakshi

వాషింగ్టన్‌: సుదీర్ఘకాలంగా ఉన్న ద్రవ్యోల్బణం, సరఫరా వ్యవస్థలో అవరోధాలు, ఇంధన మార్కెట్లలో అనిశ్చితులు అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి జోరును దెబ్బతీసినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. వాషింగ్టన్‌లో జీ20 దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్‌ బ్యాంకు గవర్నర్ల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఇండోనేషియా అధ్యక్షతన బుధవారం ఈ సమావేశం జరిగింది. అంతర్జాతీయ భవిష్యత్‌ ఆర్థిక వృద్ధి తీరు, రిస్క్‌లు, అంతర్జాతీయ ఆరోగ్యం సమావేశం అంజెండాలోని అంశాలుగా ఉన్నాయి. ఈ సందర్భంగా మంత్రి సీతారామన్‌ మాట్లాడుతూ.. స్థూల ఆర్థిక పర్యవసనాలను ఎదుర్కొనేందుకు అంతర్జాతీయంగా విధానాల సమన్వయానికి జీ20 తగిన ప్రేరణనిచ్చే స్థితిలో ఉందని మంత్రి సీతారామన్‌ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థలను కాపాడేందుకు చురుకై, ఉమ్మడి చర్యల అవసరం ఉందన్నారు. 

ప్రముఖులతో సమావేశాలు.. 
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌), ప్రపంచబ్యాంకు వార్షిక సమావేశాల్లో పాల్గొనేందుకు గత సోమవారం వాషింగ్టన్‌కు నిర్మలా సీతారామన్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఐఎంఎఫ్‌ చీఫ్‌క్రిస్టలీనా జార్జీవాతో భేటీ అయ్యారు. అలాగే, అమెరికా వాణిజ్య మంత్రి గినారాయ్‌మోండోతో చర్చలు నిర్వహించారు. ఆర్థిక సహకార విస్తృతికి గల మార్గాలపై చర్చించారు. సెమీకండక్టర్‌ ఇండస్ట్రీ అసోసియేషన్‌ ప్రెసిడెంట్, సీఈవో జాన్‌ నెఫర్‌ తోనూ సీతారామన్‌ సమావేశమయ్యారు. సెమీకండక్టర్‌ పరిశ్రమకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించడం, పరిశ్రమలో విదేశీ పెట్టుబడులకు ఆహ్వానం పలకడాన్ని నెఫర్‌ ప్రశంసించారు.  

2047 నాటికి అధిక ఆదాయ దేశంగా భారత్‌: అమితాబ్‌ కాంత్‌ ఆకాంక్ష
న్యూఢిల్లీ:  భారత్‌ 2047 నాటికి అధిక ఆదాయం కలిగిన దేశంగా అవతరించాలన్న ఆకాంక్షతో పనిచేయాలని నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ పిలుపునిచ్చారు. ఇందుకోసం ఏటేటా స్థిరమైన వృద్ధి రేటు సాధించాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. భారత్‌ తన ప్రైవేటు రంగ సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే మంచి వృద్ధిని సాధిస్తుందన్నారు. 1947లో దక్షిణ కొరియా, చైనా, భారత్‌ తలసరి ఆదాయం ఇంచుమించు ఒకే స్థాయిలో ఉన్న విషయాన్ని కాంత్‌ గుర్తు చేశారు. 75 ఏళ్ల తర్వాత చూస్తే దక్షిణ కొరియా తలసరి ఆదాయం భారత్‌ కంటే ఏడు రెట్లు అధికంగా ఉన్నట్టు చెప్పారు. చైనా, దక్షిణ కొరియా ఏటేటా 10 శాతం వృద్ధిని నమోదు చేయడం వాటికి సాయపడినట్టు తెలిపారు.

చదవండి👉 భారత్‌కు ఆ సత్తా ఉంది,రష్యాతో పెట్టుకోవద్దు..అలా చేస్తే అమెరికాకే నష్టం!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top