
స్వీడిష్ లగ్జరీ కార్ల దిగ్గజం వోల్వో తమ చిన్న ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఈఎక్స్30ని ఈ ఏడాదే భారత మార్కెట్లో ప్రవేశపెట్టే యోచనలో ఉంది. దేశీయంగా ఏటా ఒక ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెట్టాలనే వ్యూహానికి అనుగుణంగా దీన్ని తీసుకురానున్నట్లు సంస్థ ఎండీ జ్యోతి మల్హోత్రా తెలిపారు. మిగతా కార్లలాగానే ఈ వాహనాన్ని బెంగళూరు ప్లాంటులో అసెంబుల్ చేసి విక్రయించాలని భావిస్తున్నామని, ప్రస్తుతం సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు.
ఓ కొత్త సెగ్మెంట్ సృష్టించడం ద్వారా ఇది దేశీయంగా ఈవీల వినియోగం మరింతగా పెరిగేందుకు ఉపయోగపడగలదని మల్హోత్రా చెప్పారు. గతేడాది తాము భారత్‌లో విక్రయించిన ప్రతి నాలుగు కార్లలో ఒకటి ఎలక్ట్రిక్‌దని ఆయన వివరించారు. ఈ విభాగంలో ఎక్స్‌సీ40, సీ40 అని తమకు రెండే కార్లు ఉన్నప్పటికీ వీటి అమ్మకాలు తమ మొత్తం కార్ల విక్రయాల్లో దాదాపు పాతిక శాతానికి చేరినట్లు మల్హోత్రా చెప్పారు. ప్రస్తుతం మాస్ మార్కెట్ విభాగంలో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం రెండు శాతంగానే ఉన్నప్పటికీ లగ్జరీ సెగ్మెంట్లో 6–7 శాతంగా ఉన్నట్లు వివరించారు. 2030 నాటికి అంతర్జాతీయంగా 90–100 శాతం ఆదాయాలను ఎలక్ట్రిక్ కార్ల నుంచే ఆర్జించాలనే లక్ష్యం దిశగా ముందుకు సాగుతున్నట్లు వివరించారు.
ఇదీ చదవండి: ఇంజినీరింగ్ ఎగుమతుల జోరు
కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం..ఇది 427 హెచ్‌పీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కేవలం 3.6 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. EX30 రెండు బ్యాటరీ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. 51 కిలోవాట్ల లిథియం-ఐరన్-ఫాస్ఫేట్ (ఎల్ఎఫ్‌పీ) బ్యాటరీ, 69 కిలోవాట్ల నికెల్-మాంగనీస్-కోబాల్ట్ (ఎన్ఎంసీ) బ్యాటరీలో వస్తుంది. గరిష్టంగా అధిక సామర్థ్యం ఉన్న బ్యాటరీ వేరియంట్ ఒకసారి ఛార్జ్ చేస్తే 474 కి.మీ వరకు ప్రయాణిస్తుంది.