వైజాగ్‌ స్టీల్‌ క్యూ1 టర్నోవర్‌ రూ. 5,223 కోట్లు

Visakhapatnam Steel Plant records turnover of over Rs 5223 Crores - Sakshi

ఉక్కునగరం(గాజువాక): ప్రైవేటీకరణ సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) మొదటి త్రైమాసికం(ఏప్రిల్‌–జూన్‌)లో రూ. 5,223 కోట్ల టర్నోవర్‌ సాధించింది. గత ఏడాది(2020–21) ఇదే కాలంలో సాధించిన రూ. 2,306 కోట్లతో పోలిస్తే  ఆదాయంలో 126 శాతం వృద్ధి సాధించింది. ఇక ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 98 శాతం అధికంగా 12.37 లక్షల టన్నుల సేలబుల్‌ స్టీల్‌ను ఉత్పత్తి చేసింది. గతేడాది క్యూ1లో 6.26 లక్షల టన్నులు మాత్రమే  తయారు చేసింది.

ఈ బాటలో 10.34 లక్షల టన్నుల సేలబుల్‌ స్టీల్‌ అమ్మకాలు సాధించగా.. గత క్యూ1లో కేవలం 6.78 లక్షల టన్నులు విక్రయించింది. వెరసి 54 శాతం శాతం పురోగతిని సాధించింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.18 వేల కోట్ల టర్నోవర్‌తో స్టీల్‌ప్లాంట్‌ చరిత్రలో రెండో అత్యధిక అమ్మకాలు సాధించిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఈ  ఏడాది జనవరి 27న స్టీల్‌ప్లాంట్‌ 100% ప్రైవేటీకరణకు ఆమోదముద్ర వేసింది. అప్పటి నుంచి ఉద్యోగులు ఒకవైపు ఆందోళన చేస్తూ మరోవైపు ఉత్పత్తిని ఉరకలు వేయిస్తున్నారు. తద్వారా టర్నోవర్‌లో కూడా గణనీయమైన ప్రగతి కనబర్చడం విశేషం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top