వేదాంతా లాభం క్షీణత

Vedanta Q4 Net profit plunges 68percent YoY to Rs 1,881 crore - Sakshi

క్యూ4లో రూ. 3,132 కోట్లు

న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్‌ దిగ్గజం వేదాంతా లిమిటెడ్‌ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 57 శాతం క్షీణించి రూ. 3,132 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో రూ. 7,261 కోట్లు ఆర్జించింది. అల్యూమినియం బిజినెస్‌ తగ్గడం, రైటాఫ్‌లు లాభాలను దెబ్బతీశాయి.

అయితే త్రైమాసికవారీగా(క్యూ3) చూస్తే నికర లాభం(రూ. 3,092 కోట్లు) 1 శాతం బలపడింది. అయితే మొత్తం ఆదాయం 5 శాతం క్షీణించి రూ. 37,225 కోట్లను తాకింది. అంతక్రితం క్యూ4లో రూ. 39,342 కోట్ల టర్నోవర్‌ సాధించింది. జింక్‌ నుంచి ముడిఇనుము వరకూ కమోడిటీ ధరలు తగ్గడం ఫలితాలను ప్రభావితం చేసింది. వీటికితోడు చమురు, గ్యాస్‌ బిజినెస్‌ నుంచి రూ. 1,336 కోట్లమేర అనుకోని నష్టం వాటిల్లినట్లు కంపెనీ వెల్లడించింది. ఇక గతేడాది కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 1,45,404 కోట్ల టర్నోవర్‌ అందుకుంది.

పెట్టుబడులకు సై
గ్రూప్‌ వ్యవస్థాపకుడు, చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ సోదరుడు నవీన్‌ అగర్వాల్, కుమార్తె ప్రియా అగర్వాల్‌లను బోర్డు ఐదేళ్లపాటు డైరెక్టర్లుగా తిరిగి నియమించినట్లు వేదాంతా పేర్కొంది. చమురు, గ్యాస్‌ అన్వేషణకు 29.6 కోట్ల డాలర్ల పెట్టుబడి వ్యయాలకూ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలియజేసింది. ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) 1.7 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి ప్రణాళికలున్నట్లు వెల్లడించింది.

 ఫలితాల నేపథ్యంలో వేదాంతా షేరు 2.3 శాతం నీరసించి రూ. 275 వద్ద ముగిసింది.   
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top