
భారత్ - పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమవుతున్న వేళ, అమెరికా అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' ట్వీట్ చేశారు. ట్రంప్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. సాయంత్రం 5:33 గంటలకు చేసిన ఈ ట్వీట్‌కు ఏకంగా 18.7 మిలియన్స్ వీక్షణలు (సాయంత్రం 7:05 గంటలకు), 35వేల కంటే ఎక్కువ కామెంట్స్, 72వేల కంటే ఎక్కువ రీట్వీట్స్ వచ్చాయి. సుమారు మూడు లక్షల కంటే ఎక్కువ లైకులు పొందింది.
భారత్ - పాక్‌లతో చర్చలు జరిపాము. ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించాము. కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి. రెండు దేశాలకు నా అభినందనలు అంటూ ట్రంప్ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.

కాల్పుల విరమణ
భారత్, పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అధికారికంగా పేర్కొన్నారు. సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విమరణ అమలులోకి వచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఈ రోజు మధ్యాహ్నం 3.35 గంటలకు పాక్ DGMO.. భారత్ DGMOకు ఫోన్ చేసి కాల్పులు విమరణ చేయాలని కోరినట్లు మిస్రీ పేర్కొన్నారు. పాకిస్తాన్ అభ్యర్థనతో.. భారత్ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు చెప్పారు. కాగా ఎల్లుండి (సోమవారం, మే 12) మధ్యాహ్నం 12 గంటలకు ఇరుదేశాల మిలటరీ జనరల్స్ మధ్య చర్చలు జరుగుతాయని ప్రకటించారు.