సంపన్నులు... రయ్‌ రయ్‌!

Ultra-high networth population in India may rise 63% in 5 yrs - Sakshi

ఐదేళ్లలో 11,198కు చేరనున్న హెచ్‌ఎన్‌ఐల సంఖ్య; 63 శాతం వృద్ధి

రూ. 200 కోట్లకుపైగా ఆస్తులు కలిగిన వ్యక్తులపై

నైట్‌ ఫ్రాంక్‌ అంచనాలు

ఇదే బాటలో 43 శాతం జంప్‌చేయనున్న బిలియనీర్ల సంఖ్య

న్యూఢిల్లీ: కనీసం 3 కోట్ల డాలర్ల(సుమారు రూ. 220 కోట్లు) సంపద కలిగిన వ్యక్తుల సంఖ్య రానున్న ఐదేళ్లలో భారీగా పెరగనున్నట్లు నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా అంచనా వేసింది. అత్యధిక వ్యక్తిగత సంపద కలిగిన వ్యక్తుల సంఖ్య 63 శాతం జంప్‌చేయనున్నట్లు ప్రాపర్టీ కన్సల్టెంట్‌ సంస్థ అభిప్రాయపడింది. వెరసి అత్యంత సంపన్నుల(యూహెచ్‌ఎన్‌డబ్ల్యూఐలు) సంఖ్య 11,198కు చేరనున్నట్లు పేర్కొంది. తద్వారా ప్రపంచంలోనే సంపన్నుల వృద్ధిలో రెండో వేగవంత దేశంగా భారత్‌ నిలిచే వీలున్నట్లు విశ్లేషించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంపద కలిగిన వ్యక్తుల సంఖ్య 5,21,653గా నమోదైనట్లు 2021 వెల్త్‌ నివేదికలో తెలియజేసింది. వీరిలో 6,884 మంది భారతీయులేనని పేర్కొంది. 2020–25 మధ్య కాలంలో అంతర్జాతీయంగా సంపన్నుల సంఖ్య 27 శాతం పుంజుకోవచ్చని అంచనా వేసింది. దీంతో వీరి సంఖ్య 6,63,483ను తాకవచ్చని అభిప్రాయపడింది.  

బిలియనీర్లు... 162కు!
2025కల్లా దేశీయంగా బిలియనీర్ల సంఖ్య 43 శాతం ఎగసి 162కు చేరే వీలున్నట్లు నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా పేర్కొంది. ప్రస్తుతం ఈ సంఖ్య 113గా నమోదైంది. కాగా.. బిలియనీర్ల వృద్ధిలో ప్రపంచ సగటు 24%కాగా, ఆసియాలో 38%. ఇక ఆసియాలో చూస్తే అత్యంత సంపన్నుల వృద్ధిలో ఇండోనేసియా 67%తో తొలి స్థానంలో నిలుస్తున్నట్లు నివేదిక తెలియజేసింది. కోవిడ్‌–19 కల్లోలం తదుపరి భారత ఆర్థిక వ్యవస్థ వేగవంతంగా రివకర్‌ అవుతున్నట్లు నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా సీఎండీ శిశిర్‌ బైజాల్‌ పేర్కొన్నారు. తద్వారా రానున్న ఐదేళ్లలో 5 ట్రిలియన్‌ డాలర్ల జీడీపీని సాధించే దిశలో సాగుతున్నట్లు అభిప్రాయపడ్డారు. కొత్తగా వెలుగులోకి వస్తున్న రంగాలలో అవకాశాలు కల్పించడం ద్వారా భారత్‌ ఆర్థికంగా మరింత పరిపుష్టిని సాధించే వీలున్నదని పేర్కొన్నారు. వెరసి ఆసియాలో సూపర్‌పవర్‌గా ఆవిర్భవించవచ్చని అంచనా వేశారు. సరికొత్త ఆర్థిక అవకాశాలు సంపద సృష్టి కి సహకరించనున్నాయని, ఇది అత్యంత సంపన్నుల వృద్ధికి దారిచూపనుందని వివరించారు. వ్యక్తిగత సంపన్నుల్లో ముంబై, ఢిల్లీ, బెంగళూరు రేసులో ముందున్నట్లు నివేదిక పేర్కొంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top