బహుమతిగా భవిష్యత్తు! | Turn Festive Gifts into SIPs | Sakshi
Sakshi News home page

బహుమతిగా భవిష్యత్తు!

Oct 12 2026 6:28 AM | Updated on Oct 12 2026 6:28 AM

Turn Festive Gifts into SIPs

దసరాకు గిఫ్ట్‌ ఇవ్వండి...కానీ ఖర్చయిపోయేది కాదు 

దీపావళికి వెలుగులు పంచండి ..కానీ ఇంటికి మాత్రమే కాదు. 

పుట్టినరోజుకు గిఫ్ట్‌ ఇవ్వండి.. కానీ ఒకరోజు ఆనందం కోసం కాదు 

గిఫ్ట్‌ విలువ దాని ధరలో కాదు అది ఎంతకాలం గుర్తుంటుందనే దానిపై ఉంటుంది 

అందుకే ఈసారి ఇచ్చే బహుమతి గురించి కాస్త కొత్త గా ఆలోచించండి

దసరా వస్తే బహుమతులు, దీపావళి వస్తే స్వీట్లు, పుట్టినరోజుకు గిఫ్టులు, పెళ్లిరోజంటే కానుకలు. సంతోషాన్ని పంచుకోవడానికి సందర్భాలు ఎన్నో. బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం మన సంప్రదాయంలో భాగమే.కానీ ఆ ఇచ్చే బహుమతి ఆనందం ఆ ప్రత్యేకమైనరోజుకే పరిమితం కాకుండా ఏళ్ల తరబడి విలువ పెంచుకుంటూ వెళితే...అందుకే ఈ సారి ఇచ్చే బహుమతి కొత్తగా ఎలా ఉండాలో ఆలోచించండి అని తెలిపే వెల్త్‌ స్టోరీ

బట్టలు, గ్యాడ్జెట్లు, స్వీట్లు, నగదు, గిఫ్ట్‌ వోచర్లు, వీటికి బదులు ఏదైనా మ్యూచువల్‌ ఫండ్‌ లో ఒక సిప్‌ (ఎస్‌ఐపీ)ను బహుమతిగా ఇస్తే... ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఆత్మీయులకు ముచువల్‌ ఫండ్‌ సిప్‌ ప్రారంభించడం ద్వారా ఆ ఒక్కరోజు ఆనందాన్ని దీర్ఘకాలిక సంపద సృష్టికి ప్రయాణంగా మార్చొచ్చు. ముఖ్యంగా పెట్టుబడులు ప్రారంభించని వారికి పొదుపు అలవాటును చేసి సంపద పెంచుకునేందుకు వేసే తొలి అడుగుగా తోడ్పడవచ్చు. ఒక్కసారి ఇచ్చే బహుమతి జ్ఞాపకంగా మిగిలిపోతుంది. కానీ సరైన లక్ష్యం, కాల వ్యవధి, రిస్క్‌ సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చేసే పెట్టుబడి కాలంతో పాటు పెరిగే సంపదకు బాట వేస్తుంది. అందుకే ఈ పండుగ సీజన్‌లో ఒకసారి ఆలోచించండి. ఏం గిఫ్ట్‌ ఇవ్వాలని కాదు..వాళ్ల భవిష్యత్తుకు ఏం ఇవ్వాలి అని.. 

గిఫ్ట్‌ కాదు...గ్రోత్‌ గేమ్‌ మార్చండి 
పండుగ కానుకగా చేతిలో పెట్టిన రూ.5000 కొద్దిరోజుల్లో ఖరై్చపోవచ్చు. కానీ అదే మొత్తాన్ని పెట్టుబడి ప్రారంభంగా మార్చి ఇస్తే.. దానికి సమయం, కాంపౌండింగ్‌ తోడైతే భవిష్యత్తులో పెద్ద మొత్తంగా మారే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు రూ.5000 నెలకు రూ.5000 సిప్‌ (సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్మెంట్‌ ప్లాన్‌)కు 10 శాతం వార్షిక రాబడి వస్తుందని అంచనావేస్తే పదేళ్లలో  ఆ 5000 రూ.10.07 లక్షలు, 15 ఏళ్లలో రూ.20.08 లక్షలు, 20 ఏళ్లలో రూ.36.20 లక్షలు అయ్యే అవకాశం ఉంది. అదే రూ.10000 సిప్‌ అయితే ఇదే కాలాల్లో సుమారు రూ.20.15 లక్షలు, రూ.40.16 లక్షలు, రూ.72.40 లక్షలు కావచ్చు. ఇది కేవలం ఉదాహరణ లెక్క మాత్రమే వాస్తవ రాబడులు మార్కెట్‌ పనితీరుపై ఆధారపడి ఉంటాయి. గిఫ్ట్‌ విలువ తక్కువైనా సమయం ఎక్కువ అయితే జరిగే మ్యాజిక్‌ అదే.. 

ఈరోజు గిఫ్ట్‌.. రేపు గ్రోత్‌.. ఎల్లుండి వెల్త్‌.. ఒక్క గిఫ్ట్‌ జీవితాంతం గుర్తుండేలా
పుట్టినరోజు నాడు ’హ్యాపీ బర్త్‌డే’ అంటూ కవర్‌లో డబ్బులు పెట్టి ఇచ్చే బదులు మ్యూచువల్‌ ఫండ్‌ సిప్‌ పెట్టుబడి రశీదును భవిష్యత్తు కోసం ఇవ్వండి 
బంధువుల పెళ్లిరోజు నాడు ఆ భార్యాభర్తలకు ఐదో పదివేలో పెట్టికొనే గిఫ్ట్‌ బదులు వారి భవిష్యత్తు లక్ష్యం కోసం పెట్టుబడి పేపర్లను అందివ్వండి 
పిల్లల గ్రాడ్యుయేషన్‌ చదువు పూర్తయింది. ఉద్యోగ జీవితం మొదలైంది.. వారు మొదటిజీతం అందుకునే ముందే ఈక్విటీల్లో తొలిపెట్టుబడిని చేసి భవిష్యత్తుకు మార్గం చూపండి. కొత్త ఉద్యోగం వచ్చినవారికి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పడమే కాదు పెట్టుబడి అలవాటు చేయడం కూడా ఆల్‌ ది బెస్టే. 
రిటైరయ్యే బంధువుకు గడియారం, షాల్‌ తో పాటు చిన్న పెట్టుబడితో వారి ఆర్థిక భద్రతకు భరోసాను బహుమతిగా ఇవ్వండి. 
బహుమతి ఇవ్వాలంటే భారీ మొత్తం అవసరంలేదు. ఆర్థిక నిపుణుల సలహా ప్రకారం రూ.1000, 2000తో నెలవారీ సిప్‌ ప్రారంభించి ఆదాయం పెరిగే కొద్దీ ఏటా దాన్ని 10నుంచి 15 శాతం  పెంచుకుంటూ వెళ్లేలా ప్రోత్సహిస్తే  రూ.1000తో ప్రారంభమయ్యే ప్రయాణం లక్షల గమ్యాన్ని చేరుతుంది.ఆదాయంతో పాటే పెట్టుబడి కూడా పెరుగుతూ వెళ్తుంది.అందుకే చిన్నమొత్తాన్ని తక్కువగా చూడకూడదు. దానికి సమయం తోడైతే అదే పెద్ద సంపద సృష్టికి బీజం కావచ్చు. ఈరోజు ఇచ్చిన చిన్న పెట్టుబడి రేపటి చదువుకు ఉపయోగపడొచ్చు. ఈరోజు ఇచ్చిన ముచువల్‌ ఫండ్‌ తొలి సిప్‌ భవిష్యత్‌లో సొంత ఇంటి లక్ష్యానికి చేరువచేయచ్చు. ఈరోజు ఇచ్చే చిన్న పెట్టుబడి రిటైర్మెంట్‌ సమయానికి పెద్ద ఆర్థిక ఆధారంగా మారొచ్చు.

కొత్త సిప్‌ ఇస్తున్నారా.. లేక ఉన్న సిప్‌కి బూస్టా?
ఇక్కడే తెలివిగా నిర్ణయం తీసుకోవాలి.ఎవరికైతే బహుమతి ఇవ్వాలనుకున్నారో ఆవ్యక్తి అప్పటికే చాలా సిప్‌లు చేస్తూ ఉంటే మరో ఫండ్‌ను జోడించడం అనవసరం. ముందుగా అతడి పోర్ట్‌ఫోలియో ఎలా ఉందో అడిగి తెలుసుకోండి. ఇప్పటికే ఉన్న సిప్‌కి ఇవ్వదలచుకున్న మొత్తాన్ని కలపడం మరింత అనుకూలంగా ఉండొచ్చు.

గిఫ్ట్‌ కోసం ఫండ్‌ ఎంపిక ఎలా ఉండాలి
పెట్టుబడి కాలం ఎంత? 
బహుమతి అందుకునే వ్యక్తి రిస్క్ ను ఎంతవరకు భరించగలడు? 
ఇప్పటికే పెట్టుబడి చేసిన ఫండ్లు ఏమిటి? 
పోర్ట్‌ఫోలియోలో ఏదైనా లోటు ఉందా? 
కొత్త సిప్‌ అవసరమా..ఉన్న సిప్‌కు టాపప్‌ సరిపోతుందా...ఇవన్నీ చూడాలి. కొత్తగా పెట్టుబడి ప్రారంభించేవారికి ఫ్లెక్సీక్యాప్, లార్జ్‌ క్యాప్, లార్జ్‌ అండ్‌ మిడ్‌ క్యాప్, వ్యాల్యూ ఫండ్స్‌ గురించి నిపుణులు సూచిస్తున్నారు.అయితే అందరికి ఒకే రకమైన పెట్టుబడి సరిపోతుందనే నియమం లేదు.

గిఫ్ట్‌ మీది.. మరి పన్ను ఎవరిది?
మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడిని బహుమతిగా ఇచ్చేటప్పుడు పన్ను అంశాన్ని కూడా మర్చిపోవద్దు. సోదరుడు, సోదరి వంటి రక్తసంబం«దీకులకు మ్యూచువల్‌ ఫండ్‌ బహుమతిగా ఇస్తే గిఫ్ట్‌పై తక్షణ పన్ను ఉండదని ఆరి్ధక నిపుణులు చెబుతున్నారు.అయితే కొంతకాలం తర్వాత వారు ఆపెట్టుబడిని విక్రయిస్తే దానిపై వచ్చే మూల ధన లాభంపై పన్ను చెల్లించే బాధ్యత పెట్టుబడి కొనసాగిస్తున్న వ్యక్తిపైనే ఉంటుంది. ఇక ఆలస్యం ఎందుకు ఈ పండుగ సీజన్‌లో గిఫ్ట్‌ బాక్స్‌ కాదు.. వెల్త్‌ బాక్స్‌ తెరవండి. బంగారు భవిష్యత్తును పంచండి.

– సాక్షి, వెల్త్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement