
హైదరాబాద్: ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) చార్జింగ్ సొల్యూషన్స్ అందించే థండర్‌ప్లస్ తాజాగా వాహనాల దిగ్గజం టాటా మోటర్స్‌తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడుతో పాటు మరో అయిదు రాష్ట్రాల్లో చిన్న వాణిజ్య వాహనాల చార్జింగ్ కోసం కొత్తగా 5,000 పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లను థండర్‌ప్లస్ ఇన్‌స్టాల్ చేయనుంది.
వాణిజ్య వాహనాల పోర్ట్‌ఫోలియోను విద్యుదీకరించుకోవాలన్న టాటా మోటర్స్ ప్రయత్నాలకు ఇది సహాయకరంగా ఉండనుంది. నిరాటంకమైన, విశ్వసనీయమైన, విస్తరించతగిన విధంగా ఈవీ చార్జింగ్ స్టేషనలను అందుబాటులోకి తేవడం తమ లక్ష్యమని థండర్‌ప్లస్ సీఈవో రాజీవ్ వైఎస్‌ఆర్ తెలిపారు
తెలుగు రాష్ట్రాల్లో టాటా పంచ్‌కు డిమాండ్
తెలుగు రాష్ట్రాల్లో ఎస్‌యూవీలకు అప్‌గ్రేడ్ కావాలనుకునే కస్టమర్లు తమ పంచ్ వాహనం వైపు మొగ్గు చూపే ధోరణి నెలకొందని టాటా మోటర్స్ ప్యాసింజర్ వెహికల్స్ (టీఎంపీవీ) తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య కాలంలో తమ మొత్తం అమ్మకాలకు సంబంధించి తెలంగాణలో 21 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 25 శాతం వాటా పంచ్‌దే ఉందని పేర్కొంది.
హైదరాబాద్, విజయవాడలో ఈ ఎస్‌యూవీ విక్రయాలు రెండింతలు పెరిగాయని కంపెనీ వివరించింది. నవరాత్రుల సందర్భంగా దేశవ్యాప్తంగా టాటా మోటర్స్ విక్రయాల్లో పంచ్ వాటా 33 శాతంగా నమోదైనట్లు పేర్కొంది. సెప్టెంబర్‌లో దేశీయంగా టాప్ 5 కార్లలో ఒకటిగా నిల్చిందని వివరించింది.