
అమెరికన్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా (Tesla).. తన 'సైబర్ ట్రక్' కార్లకు రీకాల్ ప్రకటించింది. ఇప్పటి వరకు డెలివరీ చేసిన అన్ని సైబర్ ట్రక్కులలోనూ సమస్య ఉందని గుర్తించడంతో ఈ రీకాల్ ప్రకటించింది. ఈ ప్రభావానికి 46,000 కంటే ఎక్కువ కార్లు ప్రభావితమయ్యాయి.
డ్రైవింగ్ చేస్తున్నప్పుడు.. బాహ్య ప్యానెల్ విడిపోతుందనే ఆందోళనల కారణంగా ఈ రీకాల్ ప్రకటించడం జరిగింద 'నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్' (NHTSA) వెల్లడించింది. మే 19 నుంచి వాహన యజమానులకు మెయిల్ ద్వారా రీకాల్ విషయాన్ని కంపెనీ తెలియజేయనుంది.
టెస్లా సైబర్ ట్రక్ వెలుపలి భాగంలో ఉన్న స్టెయిన్‌లెస్ స్టీల్ ట్రిమ్ ప్యానెల్ విడిపోయే అవకాశం ఉంది. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమస్యను పరిష్కరించడానికి కంపెనీ సన్నద్ధమైంది. దీనికోసం వాహనదారులు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. సంస్థ సర్వీస్ సెంటర్లలో ఉచితంగా భర్తీ చేస్తామని ఆటోమేకర్ కస్టమర్లకు హామీ ఇచ్చింది.
టెస్లా.. తన సైబర్ ట్రక్ కోసం రీకాల్ ప్రకటించడం ఇదే మొదటిసారి కాదు. యాక్సిలరేటర్ పెడల్ ఇరుక్కుపోవడం, డ్రైవ్ పవర్ కోల్పోవడం, లోపభూయిష్ట విండ్‌షీల్డ్ వైపర్‌లు, ఎలక్ట్రిక్ ఇన్వర్టర్ సమస్య వంటి కారణాలతో 15 నెలల్లో పలుమార్లు రీకాల్ ప్రకటించింది. ఇప్పుడు తాజాగా మరోమారు ఈ రీకాల్ ప్రకటించడం గమనార్హం.