
ప్రపంచ టెక్ బిలీయనీర్, టెస్లా, స్పేస్ఎక్స్ సంస్థల సీఈవో ఎలాన్ మస్క్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో అత్యంత స్నేహంగా మెలిగారు. ఎన్నికల సమయం నుంచే ట్రంప్‌నకు మద్దతుగా నిలుస్తూ ఆయన విజయానికి కృషి చేశారు. ట్రంప్ ప్రభుత్వం ఏర్పడ్డాక డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE)కి సలహాదారుగా నియమితులయ్యాయి. ఆ సమయంలో ఎలాన్ మస్క్ సంపద 25 శాతం అంటే సుమారు 113 బిలియన్ డాలర్లు (రూ.9 లక్షల కోట్లు) క్షీణించిందని బ్లూమ్‌బర్గ్ నివేదిక తెలిపింది.
తన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు, బహిరంగ అభిప్రాయాలకు ప్రసిద్ధి చెందిన మస్క్, దూకుడు వ్యయ తగ్గింపు చర్యల ద్వారా ఫెడరల్ వ్యయాలను క్రమబద్ధీకరించడానికి ఉద్దేశించిన డోజ్‌లో కీలక సలహాదారుగా పనిచేశారు. ఇటీవల మస్క్, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో ఈ చొరవ రాజకీయ కల్లోలాన్ని ఎదుర్కొంది. ట్రంప్ దగ్గర పనిచేసినందుకు ఎలాన్ మస్క్ తగిన మూల్యం చెల్లించుకున్నారని, 25 శాతం సంపద కోల్పోయారని పేర్కొన్న బ్లూమ్‌బర్గ్ నివేదికను జేడీ వాన్స్ న్యూస్ @JDVanceNewsX అనే ఎక్స్ యూజర్ ఇటీవల షేర్ చేయగా దానికి ఎలాన్ మస్క్ స్పందించారు. నిజమే అన్నట్టుగా ‘వర్త్ ఇట్’ అంటూ కామెంట్ చేశారు.
మస్క్, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయనే వార్తల నేపథ్యంలో.. ట్రంప్ 'వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు'ను మస్క్ విమర్శించడం, అభిశంసనకు గురిచేయాలని సూచించడంతో వివాదం మొదలైంది. దీనికి ప్రతిస్పందనగా, మస్క్ కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందాలను తెంచుకుంటానని ట్రంప్ హెచ్చరించారు. తన మిత్రపక్షాలతో జరిగిన వ్యక్తిగత చర్చల్లో మస్క్ ను 'పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలకు బానిస'గా ట్రంప్ అభివర్ణించారు. నాసా చీఫ్‌గా మస్క్ ఎంపిక చేసిన జారెడ్ ఐజాక్మన్ నామినేషన్‌ను ట్రంప్ వెనక్కి తీసుకోవడం వారి సంబంధాలపై మరింత ఒత్తిడి పెంచింది.
Worth it https://t.co/fQk2ULx7jh
— Elon Musk (@elonmusk) June 11, 2025