5,000 మందికి టెక్‌ మహీంద్రా ఉద్వాసన

Tech Mahindra to cut BPO staff by 5,000 in FY21 - Sakshi

ముంబై: ఐటీ రంగంలో ఉన్న టెక్‌ మహీంద్రా.. బిజినెస్‌ ప్రాసెస్‌ సర్వీసెస్‌ (బీపీఎస్‌) విభాగంలో పనిచేస్తున్న 5,000 మందిని 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగాల్లో నుంచి తీసివేయనుంది. ఆదాయాలు పెరుగుతున్నప్పటికీ కంపెనీ ఇలా ఉద్యోగులకు ఉద్వాసన పలకనుండడం గమనార్హం. ఆటోమేషన్, ఆర్టిఫీషియల్‌ ఇంటెల్లిజెన్స్‌ ఆధారంగా పనులను పూర్తి చేస్తుండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

డిసెంబరు త్రైమాసికంలో సుమారు 2,500 మందిని తీసివేయగా, వీరిలో అత్యధికులు బిజినెస్‌ ప్రాసెస్‌ సర్వీసెస్‌ విభాగానికి చెందినవారు. ‘గతేడాది మార్చినాటికి బీపీఎస్‌లో 43,000 మంది ఉండేవారు. ఈ ఏడాది మార్చికల్లా ఈ సంఖ్య 38,000లకు చేరనుంది. ఉత్పాదకతతోపాటు ఆదాయమూ పెరగడమే ఇందుకు కారణం’ అని టెక్‌ మహీంద్రా సీఈవో, ఎండీ సి.పి.గుర్నాని తెలిపారు. ఆదాయాలు పెరుగుతున్నప్పటికీ, సిబ్బందిని తగ్గించే ధోరణి రాబోయే కాలంలో కొనసాగకపోవచ్చని ఆయన అన్నారు. డిసెంబరు త్రైమాసికంలో బీపీఎస్‌ విభాగం ఆదాయం 11% వృద్ధి చెందింది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top