టాటా ఈక్విటీ పీఈ ఫండ్‌ పనితీరు భేష్‌

tata Equity PE Fund Direct Growth is a Equity mutual fund scheme from Tata Mutual Fund - Sakshi

ఈక్విటీ మార్కెట్లు అదే పనిగా నూతన గరిష్టాలకు ర్యాలీ చేస్తుండడంతో స్టాక్స్‌ విలువలు మరితంగా విస్తరించాయని.. కొన్నింటి విలువలు మరీ మితిమీరిన స్థాయికి చేరాయని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో వ్యాల్యూ స్టాక్స్‌ పట్ల దృష్టి సారించాలన్న సూచన వినిపిస్తోంది. వ్యాల్యూ స్టాక్స్‌ అన్నవి.. వాటి అంతర్గత విలువతో (ఇంట్రిన్సిక్‌ వ్యాల్యూ) పోలిస్తే ఆకర్షణీయమైన ధరల వద్ద లభించేవి. గ్రోత్‌ స్టాక్స్‌ మాదిరి వ్యాల్యూ స్టాక్స్‌ ధరలు పరుగులు పెట్టవు. కానీ స్థిరమైన పనితీరు చూపిస్తుంటాయి. అస్థిరతలు తక్కువ. దీర్ఘకాలంలో వ్యాల్యూ స్టాక్స్‌ సైతం మంచి రాబడులను ఇస్తాయని చాలా మంది నిపుణుల అంచనా. కనీసం ఐదేళ్లు అంతకంటే ఎక్కువ కాలానికి, దీర్ఘకాల లక్ష్యాల కోసం ఇన్వెస్టర్లు ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లోని వ్యాల్యూ ఫండ్స్‌ విభాగాన్ని ఎంపిక చేసుకోవవచ్చు. ఈ విభాగంలో టాటా ఈక్విటీ పీఈ ఫండ్‌ పనితీరును గమనించినట్టయితే నిలకడగా కనిపిస్తుంది. 

పెట్టుబడుల విధానం 
బీఎస్‌ఈ సెన్సెక్స్‌ పీఈ కంటే 12 నెలల ట్రెయిలింగ్‌ పీఈ రేషియో తక్కువగా ఉన్న స్టాక్స్‌ను ఈ పథకం ఎంపిక చేసుకుంటుంది. తన నిర్వహణలోని మొత్తం పెట్టుబడుల్లో 70 శాతాన్ని ఈ స్టాక్స్‌కే కేటాయిస్తుంటుంది. ఇలా ఎంపిక చేసిన కంపెనీల్లోనూ భవిష్యత్తులో మంచి వృద్ధికి అవకాశం ఉన్న వాటిని తుది జాబితాగా తీసుకుంటుంది. ఆయా రంగాల్లో కంపెనీల స్థానం ఏంటి, వాటికి ఉన్న వృద్ధి అవకాశాలు, రాబడుల రేషియోలు ఎలా ఉన్నాయి, స్టాక్‌ లిక్విడిటీ ఈ అంశాలన్నింటికీ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. అన్ని రంగాల మధ్య, అన్ని స్థాయిల కంపెనీల్లోనూ (లార్జ్, మిడ్, స్మాల్‌క్యాప్‌) ఇన్వెస్ట్‌ చేసే వెసులుబాటు ఈ పథకానికి ఉంది. 

పనితీరు 
ఈ పథకం రాబడులను గమనించినట్టయితే.. గడిచిన ఏడాది కాలంలో 47 శాతంగా ఉన్నాయి, మూడేళ్లలో చూసినా వార్షికంగా 14.52 శాతం రాబడిని ఇచ్చింది. ఐదేళ్లలో 13.61 శాతం, ఏడేళ్లలో 14.26 శాతం, పదేళ్లలో 16.62 శాతం చొప్పున వార్షిక రాబడులు ఈ పథకంలో కనిపిస్తాయి. 2004లో ఈ పథకం ప్రారంభం కాగా.. నాటి నుంచి చూసుకున్నా గానీ వార్షికంగా 19 శాతం చొప్పున పెట్టుబడులపై ఇన్వెస్టర్లకు ప్రతిఫలాన్నిచ్చింది. వ్యాల్యూ ఆధారిత విభాగం సగటు రాబడులతో పోల్చి చూస్తే ఏడేళ్లు, పదేళ్లలో ఈ పథకంలో ఎక్కువ రాబడులు కనిపిస్తాయి. 

పోర్ట్‌ఫోలియో 
ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.5,021 కోట్ల ఆస్తులున్నాయి. ఇందులో 95.5 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేయగా.. మిగిలిన మొత్తాన్ని నగదు రూపంలోనే కలిగి ఉంది. పోర్ట్‌ఫోలియోలో మొత్తం 37 స్టాక్స్‌ ఉన్నాయి. టాప్‌ 10 స్టాక్స్‌లోనే 53 శాతం పెట్టుబడులు ఉండడం గమనార్హం. పోర్ట్‌ఫోలియోలోని స్టాక్స్‌ సగటు పీఈ రేషియో 23.77 శాతంగా ఉంది. 69 శాతం పెట్టుబడులను లార్జ్‌క్యాప్‌ కంపెనీలకు కేటాయించగా.. మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌లో 27 శాతం, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌లో 4 శాతం వరకు పెట్టుబడులు పెట్టి ఉంది. బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ రంగ కంపెనీలకు 34 శాతానికి పైనే పెట్టుబడులను కేటాయించింది. ఆ తర్వాత టెక్నాలజీ రంగ కంపెనీలకు, ఇంధనం, ఎఫ్‌ఎంసీజీ కంపెనీలకు ఈ పథకం ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది.

చదవండి: స్టాక్స్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌.. పెట్టుబడికి ఏదీ మంచిది ?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top