
ఇంట్లో స్టాక్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు.. చాంతాడంత క్యూలలో నిలుచోవాల్సిన పనిలేదు. రోజూ వైన్ షాప్‌లో కనపడుతుంటే జనం అదోలా చూస్తారనే సంకోచాలక్కర్లేదు. దర్జాగా కాలు మీద కాలేసుకుని ఇంట్లో కూర్చుని కావాల్సిన మందు తెప్పించుకోవచ్చు. అంతేనా, దానితో కలిపి లాగించే సైడ్ డిష్‌లు కూడా ఒకేసారి అందుకోవచ్చు. మరి మందుబాబుల ఇలాంటి కల సాకారం కావాలంటే.. ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాలు షురూ కావాలి. ఈ దిశగా ఇప్పటికే పలు రాష్ట్రాలు ముందడుగేశాయి.
ఒడిశా పశ్చిమ బెంగాల్‌లు మద్యం హోమ్ డెలివరీని అనుమతిస్తున్న తొలి రెండు భారతీయ రాష్ట్రాలుగా ఘనత దక్కించుకున్నాయి. ఇదే కోవలో స్విగ్గీ, జొమాటో బిగ్‌బాస్కెట్ వంటి ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఆన్ లైన్ మద్యం అమ్మకాలను అనుమతించే అవకాశాన్ని అనేక ఇతర రాష్ట్రాలు కూడా పరిశీలిస్తున్నాయి. ఈ రాష్ట్రాల్లో కర్ణాటక, హర్యానా, పంజాబ్, తమిళనాడు, గోవా, కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం ఢిల్లీ లు ముందు వరుసలో ఉన్నాయి. వీటిలో కేరళ మరింత చురుకుగా ఈ విషయంపై చర్చిస్తోందని రేపో మాపో దీనిపై నిర్ణయం తీసుకోవచ్చునని తెలుస్తోంది.
కేరళ స్టేట్ బేవరేజెస్ (మార్కెటింగ్ – మాన్యుఫ్యాక్చరింగ్) కార్పొరేషన్ లిమిటెడ్ (బిఇవిసిఒ) రాష్ట్రంలో ఆన్‌లైన్ అమ్మకాల ద్వారా మద్యం ఇంటికి డెలివరీ చేసే ప్రతిపాదనను ఇటీవలే ముందుకు తెచ్చింది. కేరళలో ఆన్ లైన్ లో మద్యం అమ్మకాలను సులభతరం చేయడానికి అబ్కారీ చట్టాన్ని సవరించే గతంలో రాష్ట్ర ప్రభుత్వం తోసిపుచ్చినప్పటికీ, బిఇవిసిఒ ఈ ప్రతిపాదనను మరోసారి తెరపైకి తెచ్చింది.
గత జూలైలో బిఇవిసిఒ ఎండి హర్షిత అత్తలూరి ఈ ప్రతిపాదనను ఎక్సైజ్ శాఖకు సమర్పించారు. ఆన్‌లైన్‌లో మద్యం డెలివరీ కోసం ఫుడ్, కిరాణా డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ నుంచి తాము ప్రాజెక్ట్ ప్రతిపాదనను అందుకున్నట్లు అత్తలూరి చెప్పారు. ‘ప్రభుత్వం ఈ ప్రతిపాదనను ఆమోదిస్తే, మేం టెండర్ ప్రక్రియను ప్రారంభిస్తాము. ఎవరు తక్కువ మొత్తాన్ని బిడ్ చేస్తారో వారికి బిడ్ ఇవ్వడం జరుగుతుంది.
ఈ ప్రతిపాదన ప్రకారం, 23 సంవత్సరాలు నిండిన వ్యక్తి మాత్రమే మద్యం కోసం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయవచ్చు. వయస్సును నిర్ధారించడానికి ఐడీని తనిఖీ చేస్తారు. మా అవుట్‌లెట్‌లలో అందుబాటులో ఉన్న అన్ని రకాల ఉత్పత్తులు కూడా ఆన్ లైన్ లో విక్రయాలు జరుగుతాయి,‘ అని హర్షిత అత్తలూరి చెబుతున్నారు.
రిటైల్ అవుట్‌లెట్‌లలో రద్దీని నివారించడమే ఈ ప్రతిపాదన వెనుక ఉన్న ముఖ్య కారణం. కేరళలో మద్యం దుకాణాల ముందు పొడవైన క్యూలు కనపడడం సర్వసాధారణం, పలు చోట్ల ఇది ట్రాఫిక్ రద్దీకి కూడా దారితీస్తుంది. తమిళనాడు వంటి 4700 మద్యం దుకాణాలు ఉన్న రాష్ట్రాల మాదిరిగా కాకుండా, కేరళలో కేవలం 283 దుకాణాలు మాత్రమే ఉన్నాయి. దీనివల్ల పొడవాటి క్యూలు, రద్దీ ఏర్పడుతుంది. ఆన్ లైన్ అమ్మకాలు చురుకుగా మారిన తర్వాత, విక్రయాల్లో గణనీయమైన భాగం ఆన్ లైన్ అమ్మకాల ప్లాట్‌ఫామ్‌కు మళ్లుతుంది. ఇది అవుట్‌లెట్‌ల ముందు రద్దీని గణనీయంగా తగ్గిస్తుంది‘ అని అత్తలూరి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాకుండా మద్యం హోమ్ డెలివరీ ఆదాయాన్ని కూడా పెంచుతుందని కూడా బిఇవిసిఒ ఆశిస్తోంది. ఇప్పటికే అనేక రకాల చర్యల ద్వారా మద్యం మీద ఆదాయాన్ని ఇబ్బడిముబ్బడిగా పెంచుకుంది కేరళ రాష్ట్రం. గత 2016–17లో మద్యం నుంచి వచ్చిన ఆదాయం రూ.8778.29 కోట్లు కాగా కేవలం ఏడేళ్ల కాలంలో..గత 2024–25లో, మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయం రూ.19,700 కోట్లు కావడం దీనికి అద్దం పడుతోంది. అయితే ‘ఆన్ లైన్ అమ్మకాలతో ఈ ఆదాయం మరింత అసాధారణ రీతిలో పెరుగుతుందని తాము ఆశిస్తున్నాం అంటున్నారు హర్షిత అత్తలూరి అయితే ఈ ప్రతిపాదనను గతంలో పరిశీలించి తిరస్కరించామని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.
‘మద్యం అమ్మకం అనేది 1953 నాటి చట్ట నిబంధనల ప్రకారం జరుగుతోంది. రాష్ట్రంలో ఆన్‌లైన్ అమ్మకాలను ప్రవేశపెట్టాలంటే, అందుకు అనుగుణంగా చట్ట సవరణలు చేయాలి అంతేకాకుండా తదనుగుణంగా నియమాలను రూపొందించాలి. అన్నింటికన్నా ముందు దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలి‘ అని ఎక్సైజ్ అధికారులు అంటున్నారు.
కోవిడ్ సమయంలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం వర్చువల్ క్యూ సిస్టమ్ ద్వారా ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాన్ని ప్రవేశపెట్టింది. దీని కోసం ఒక అప్లికేషన్ కూడా అభివృద్ధి చేసింది. మద్యం వనరు ప్రధాన ఆదాయ మార్గంగా ఉన్న తరుణంలో కోవిడ్ కాలపు అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని కేరళ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవచ్చుననే అభిప్రాయాలు వస్తున్నాయి. ఇదే జరిగితే పొరుగు రాష్ట్రమైన కేరళ లో ఆన్‌లైన్ విక్రయాలు ప్రారంభమై భారీ ఆదాయం కళ్ల జూస్తే.. ఆదాయం కోసం ఆవురావురు మంటున్న మన తెలుగు రాష్ట్రాలు సైతం అదే బాటలో నడిచే అవకాశం లేకపోలేదు.